అభ్యర్థులపై ఎంపికపై కసరత్తు..
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:04 AM
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా పార్టీలకు చెందిన నియోజకవర్గాల ఇన్‌చార్జీలు అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు.
- అధికార కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ
- ఆచీతూచి అడుగేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ
- అభ్యర్థుల వేటలో పడ్డ భారతీయ జనతా పార్టీ
- కాంగ్రెస్‌లో చైర్మన్ అభ్యర్థులు కొలిక్కి?
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా పార్టీలకు చెందిన నియోజకవర్గాల ఇన్‌చార్జీలు అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల లొల్లి ఎక్కువగా ఉండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచి అడుగెస్తున్నది. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చే వారికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, మరికొన్ని స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలనే విషయమై ఆలోచన చేస్తున్నది. భారతీయ జనతా పార్టీకి అన్ని డివిజన్లు, వార్డుల్లో పోటీచేసే అభ్యర్థులు లేకపోవడంతో లేనిచోట ఆ పార్టీ నాయకులు అభ్యర్థుల వేటలో పడ్డారు. రిజర్వేషన్ తనకు అనుకూలంగా వస్తుందని భావించి ఎప్పటినుంచో ఆ స్థానంలో వర్క్ చేసుకుంటున్న కొందరు నాయకులకు అనుకూలంగా రిజర్వేషన్ రాకపోవడంతో పక్క చూపులు చూస్తున్నారు. తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ తమ పార్టీ నాయకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, మంథని, రామగుండం మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 124డివిజన్లు, వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో నాలుగింటిలో బీఆర్‌ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేయగా, ఈసారి కాంగ్రెస్‌పార్టీ మొత్తం హస్తగతం చేసుకోవాలని తహతహ లాడుతున్నది. మంథని నుంచి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరమణారావు, రామగుండం నుంచి రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థు లను ఎంపిక చేసే బాధ్యత కాంగ్రెస్‌పార్టీ తమ ఎమ్మెల్యేలకు అప్పగించగా, బీఆర్‌ఎస్ పార్టీ సైతం ఎమ్మెల్యేలు ఉన్నచోట ఎమ్మెల్యేలకు, లేనిచోట గతఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి ఓటమిచెందిన నాయకులకే బాధ్యత అప్పగించారు. రామగుండం నుంచి కోరుంటి చందర్, పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, మంథని నుంచి పుట్ట మధుకర్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. రామగుండంలో 60 డివిజన్లు, పెద్దపల్లిలో 36వార్డులు, సుల్తానాబాద్‌లో 15వార్డులు, మంథనిలో 13 వార్డులున్నాయి. అధికార కాంగ్రెస్‌పార్టీలో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చినట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు సర్వేలు చేయించారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమర్థులైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తు న్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల ద్వారా సత్తా చాటాలని చూస్తున్నారు. మాజీ కార్పొరేటర్లు, మాజీకౌన్సిలర్లతోపాటు యువకులు, విద్యావంతులను సైతం రంగంలోకి దింపాలని చూస్తున్నారు. వారం రోజుల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని అధికారపార్టీకి గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను ఎంపిక చేసి పోటీలో నిలపాలని దిశానిర్దేశం చేశారు. పరిస్థితులను బట్టి చైర్మన్ అభ్యర్థులను ముందే ప్రకటించాలని సూచించారని సమాచారం. అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ గతఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్‌లో నాలుగు స్థానాలు, పెద్దపల్లి మున్సిపాలిటీలో రెండుస్థానాల్లో గెలుపొందగా, ఈసారి అన్నిస్థానాల్లో అభ్యర్థులను నిలిపి సత్తా చాటేందుకు సన్నద్ధం అవుతోంది. అయితే ఈ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేని కారణంగా అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మార నున్నది. అన్ని డివిజన్లు, వార్డుల్లో సరైన అభ్యర్థులు లేకపోవడం గమనార్హం.
ఫ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థులు కొలిక్కి?
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వలే మున్సిపల్ ఎన్నికల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపికలోనే గాకుండా మేయర్, చైర్మన్‌ల ఎంపికలోనూ ముందున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ పదవి తిరిగి ఎస్సీ జనరల్‌కే కావడంతో మాజీమేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, మహంకాళి స్వామి మేయర్ పదవికోసం పోటీ పడుతున్నారు. ఈ కార్పొరేషన్‌లో మరో 10డివిజన్లు పెరగడంతో గతంలో ఉన్న డివిజన్లు చెల్లాచెదుర య్యాయి. కొందరు అభ్యర్థులు డివిజన్లు వెతుక్కునే పనిలో పడ్డారు. మేయర్ పదవి కోసం ప్రస్తుతం ఇద్దరి పేర్లు మాత్రమే బలంగా వినిపిస్తున్నాయి. పెద్దపల్లి మున్సి పల్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో మాజీకౌన్సిలర్ నూగిళ్ల మల్లయ్య పేరు ఖరారైనట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే విజయరమణారావు ప్రధాన అనుచరుడు కావడంతో ఆయనకే మాట ఇచ్చినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో 24వ వార్డు నుంచి పోటీచేయగా, ఆ వార్డు బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆయనను 21వ వార్డు నుంచి పోటీచేయాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. అలాగే సుల్తానాబాద్ మున్సిపల్‌చైర్మన్ పదవి జనరల్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుటుంబానికి ఇచ్చే అవకాశాలున్నాయి. విజయ రమణారావు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో బిరుదు రాజమల్లు కీలకపాత్ర పోషించారు. ఆయన దివంగతుడు కావడం, తన కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్మన్ చేయాలని తన చిరకాల కోరికను నెరవేర్చాలని భావిస్తున్నారు. రాజమల్లు కుమారుడు బిరుదు కృష్ణ 4వవార్డు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆయనే గాకుండా అంతటి పుష్పలత, గాజుల రాజమల్లు సైతం చైర్మన్ రేసులో ఉండనున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించడంతో అక్కడి నుంచి మాజీసర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ పేరును మంత్రి శ్రీధర్‌బాబు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. శ్రీనివాస్ ఎన్‌ఎస్‌యూఐ నుంచి మొదలుకుని కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఏపార్టీ మారకుండా పనిచేస్తున్నారు. ఆయన 10వ వార్డు నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆయన గాకుండా మరికొందరు నాయకులు చైర్మన్ కోసం పోటీపడే అవకాశాలున్నాయి. ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన రంగంలోకి దిగేందుకు ఆయాపార్టీల నాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఈసారి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి.