Share News

ఆర్టీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:49 AM

జిల్లాలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.

ఆర్టీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

జగిత్యాల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్టీసీ డిపోల్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. కార్మిక సంఘాల నేతలు ఓటర్లు అయిన ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. డిపోలు, కార్యాలయాల పరిధిలో సిబ్బందిని కలిసి తమ సంఘం మేనిఫెస్టోతో పాటు సాధించనున్న డిమాండ్లను వివరించారు.

ఫ17న ఫలితాలు

జిల్లాలో మూడు ఆర్టీసీ డిపోలు ఉండగా 665 మంది ఓటర్లున్నారు. ఇందులో మెట్‌పల్లి డిపో పరిధిలో 177 ఓట్లు, జగిత్యాల డిపోలో 302, కోరుట్ల డిపోలో 186 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల సందర్బంగా రాష్ట్ర స్థాయిలో 11 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. రీజియన్‌ స్థాయిలో పలు సంఘాలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలోల్ల ప్రతీ కార్మికుడు రాష్ట్ర స్థాయిలో ఒక ఓటు, రీజియన్‌ స్థాయికి మరో ఓటు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌, రీజియన్‌ స్థాయికి లేత ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగిస్తారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించినా ఫలితం మాత్రం వెల్లడించరు. ఆ రోజు విధుల్లో ఉండే కార్మికులకు 14, 15వ తేదీల్లో బ్యాలెట్‌ పద్ధతిలో ఓటు వేసే అవకాశం కల్పించి వీరి ఓట్లు కూడా లెక్కించాక 17వ తేదీన తుది ఫలితం ప్రకటిస్తారు. మొత్తంగా 51 శాతం ఓట్లు పొందిన సంఘానికి గుర్తింపు హోదా కల్పిస్తారు.

ఫపదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల సందడి..

2016 జూలైలో చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణ మజ్ధూర్‌ యూనియన్‌ (టీఎంయూ) రాష్ట్రంలోని 11 రీజియన్లలో 10 చోట్ల విజయం సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. ఆ సంఘం పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినా మళ్లీ ఎన్నికలు జరగలేదు. అప్పటితో పోలిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడం, కొత్త కార్మిక సంఘాల ఆవిర్భావం, సంఘాల మద్య పొత్తులతో పోటీ నెలకొంది. పదేళ్ల విరామం తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పెండింగ్‌ వేతన సవరణ, బకాయిలు, సిబ్బంది కొరత, పని ఒత్తిడి తదితర అంశాలు కార్మిక సంగాల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

Updated Date - Oct 09 , 2026 | 12:49 AM