Share News

జన జాతరకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:51 AM

సమ్మక్క సారక్క అబ్నియా.. జాలారు బండల్లో అబ్బియా అంటూ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాలు బుధవారం నుంచి మారుమోగ నున్నాయి. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య తల్లులు వనం వీడి గద్దెలపైకి రానున్నారు.

జన జాతరకు సర్వం సిద్ధం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): సమ్మక్క సారక్క అబ్నియా.. జాలారు బండల్లో అబ్బియా అంటూ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాలు బుధవారం నుంచి మారుమోగ నున్నాయి. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య తల్లులు వనం వీడి గద్దెలపైకి రానున్నారు. వారి దీవెనల కోసం పెద్ద ఎత్తున భక్తులు ఎదురు చూస్తున్నారు. భక్తుల ఇలవేల్పు.. భక్తుల కొంగు బంగారం.. కోరిన వరాలు ఇచ్చే ఆ దేవతలను పదిహేను రోజుల నుంచి పూజిస్తున్న భక్తులు వారిని దర్శించుకునేందుకు సంసిద్ధమయ్యారు. వారి అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్న భక్తులు రెండోళ్లకోసారి వారిని తలుచుకుంటూ మొక్కులు అప్ప గిస్తారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలోని జాతర ప్రాంగణం జనారణ్యంగా మారనున్నాయి. తెలంగాణ కుంభమేళాగా పేరొందడం మేడారం సమ్మక్క సారలమ్మ, జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. మేడారం అనుబంధంగా జిల్లాలో పలుచోట్ల జరగనున్న జాతర ఉత్సవాలకు దేవాదాయ శాఖ వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 28వ తేదీన సారలమ్మ గద్దెపై కొలువుదీరనుండడంతో జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా జాతర ప్రాంగణాలకు తీసుక రానున్నారు. 29వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరనున్నది. అదే రోజు నుంచి 31వ తేదీ వరకు భక్తులు తల్లులకు మొక్కులు సమర్పించు కోనున్నారు. అదే రోజు సాయంత్రం తల్లులు వన ప్రవేశం చేయనుం డడంతో జాతర ముగియనున్నది.

జిల్లాలో జాతరకు ఏర్పాట్లు పూర్తి..

మేడారం జాతరకు అనుబంధంగా జిల్లాలోని 34 ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్నది. అంతర్గాం మండలం గోదావరి ఒడ్డున గల గోలివాడ, గోదావరిఖనిలోని గంగ బ్రిడ్జి, మానేరు తీరాన గల సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల, ఓదెల మండలం కొలనూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట్‌, పెద్దరాతుపల్లి, కమాన్‌పూర్‌ మం డలం గుండారం, ముత్తారం మండలం మైదుబండ, పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, హన్మంతునిపేట, పాలకుర్తి మండలం ఈసాలతక్క ళ్లపల్లి, వేమునూర్‌, రాణాపూర్‌, ధర్మారం మండలం ధర్మారం, ఎర్రగుంట పల్లి, కటికెనపల్లి, నందిమేడారం, చామనపల్లి, దొంగతుర్తి, నర్సింగాపూర్‌, ఎలిగేడు మండలం లాలపల్లి, ఎలిగేడు, తేలుకుంట, జూలపల్లి మండలం అబ్బాపూర్‌, సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి, నారాయణపూర్‌, తొగర్రాయి, ఓదెల మండలం గుంపుల వద్ద నాలుగు రోజుల పాటు జాతర జరగనున్నది. స్థానికంగా జరిగే జాతరతో పాటు మేడారంలో జరిగే జాతరకు కూడా జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతున్నారు.


జాతర ప్రాంగణాలు, రోడ్ల అభివృద్ధి..

మేడారం జాతరకు అనుబంధంగా జరగనున్న జిల్లాలోని పలు జాతరలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, విజయరమణారావు జాతరల అభివృద్ధికి కృషి చేశారు. గోదావరిఖని గంగ బ్రిడ్జి సమీపంలో జరిగే జాతర ప్రాంగణాన్ని, అక్కడికి వచ్చే రహదారులను 4 కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణ పనులను చేప ట్టారు. గోలివాడ, ఈసాలతక్కళ్లపల్లి, తదితర జాతరలకు నిధులు మంజూరు చేశారు. ఓదెల మండలం కొలనూరు, నారాయణపూర్‌, తురకలమద్దికుంట, హనుమంతునిపేట జాతర ప్రాంగణానికి వచ్చే రహదారులకు ఒక్కో రహదారికి కోటి రూపాయలు, పెద్దరాతుపల్లి జాతర ప్రాంగణానికి వచ్చే రహదారికి కోటీ 65 లక్షలు, మీర్జంపేట జాతరకు కోటి రూపాయలు, అక్కడక్కడ జాతర ప్రాంగణాల్లో సీసీ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేశారు.

పదిహేను రోజుల నుంచే మొక్కులు..

పదిహేను రోజుల నుంచే ఇళ్లల్లో సమ్మక్క చేసుకుని మొక్కు తీర్చుకుంటున్నారు. జిల్లా నుంచి వేలాది మంది ఇప్పటికే మేడారం వెళ్లి వచ్చారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు మొక్కుల ప్రకారం తల్లులకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటున్నారు. జాతరలో తల్లులను దర్శించుకుని పసుపు, కుంకుమ, కొబ్బరి కాయలు, బంగారం (బెల్లం) సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి వెదురుకంక, కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను మేడారం నుంచి వచ్చే ప్రత్యేక గిరిజన పూజారులు డప్పుల చప్పుళ్ల మధ్య తీసుకవస్తారు. దారిలో మహిళలు మంగళహారతులు పట్టుకుని జేజేలు పలుకుతారు. సమ్మక్కను తీసుక వచ్చే సమయంలో పూజారి తమను తొక్కుకుంటూ వెళ్లాలని వారికి అడ్డంగా పడుకుని ఉంటారు. సమ్మక్కను గద్దెపై కొలువు దీరిన తర్వాత భక్తులు ఆ తల్లులను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. శుక్రవారం రోజున జాతర ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిసిపోనున్నాయి. జాతరల్లో భక్తులకు ఇబ్బం దులు కలగకుండా అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, జాతర కమిటీలు తాగునీటి సౌకర్యం, లైటింగ్‌, వైద్య సదుపాయం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు.


మేడారం వెళుతున్న భక్తులు..

ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు రోజుల నుంచి భక్తులు తరలి వెళుతున్నారు. జిల్లాలోని పెద్దపల్లి నుంచి 175 బస్సులు, గోదావరిఖని నుంచి 115 బస్సులు, మంథని నుంచి 170 బస్సులు మొత్తం 410 బస్సులను నడుపుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచే బస్సులు నడుస్తున్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం..

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సుల్లో వెళ్లే మహి ళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. 2024లో జరిగిన జాతర సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ట్లుగానే ప్రస్తుతం కల్పిస్తున్నారు. పురుషులకు మాత్రం ప్రత్యేక సర్వీస్‌ చార్జీలను వసూలు చేయనున్నారు. పెద్దపల్లి నుంచి పెద్దలకు 420, పిల్లలకు 240, గోదావరిఖని నుంచి పెద్దలకు 400, పిల్లలకు 230, మంథని నుంచి పెద్దలకు 350, పిల్లలకు 210 రూపాయల చార్జీ నిర్ణయించారు. మొక్కుల కోసం ఆ అమ్మవార్లకు బలిచ్చే మేకలను తీసుక వెళితే వాటికి కూడా ఫుల్‌ టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Jan 29 , 2026 | 11:28 AM