Share News

అన్నీ ఖాళీలే..!

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:39 AM

జిల్లా పరిపాలనలో కీలక శాఖలకు అధికారుల కొరత వేధిస్తోంది. ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆయా శాఖల బాధ్యతలను ఇంచార్జీలకు అప్పగించి కాలం వెళ్లదీస్తున్నారు.

 అన్నీ ఖాళీలే..!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లా పరిపాలనలో కీలక శాఖలకు అధికారుల కొరత వేధిస్తోంది. ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆయా శాఖల బాధ్యతలను ఇంచార్జీలకు అప్పగించి కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడుతోంది. సమస్యలపై సత్వర నిర్ణయాలు తీసుకునే నాథుడు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మైనింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుతో పాటు జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా సంక్షేమ శాఖాధికారి, జిల్లా ట్రెజరరీ అధికారి, డీపీఆర్‌ఓ, ఏపీఆర్‌ఓ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా శాఖలకు వివిధ పనుల కోసం వస్తున్న ప్రజలు సకాలంలో పనులు గాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఫ మైనింగ్‌ ఏడీ పోస్టు ఖాళీ..

జిల్లాలో సింగరేణి గనులు, గుట్టలు, కంకర క్వారీలు, గ్రానైట్‌ క్వారీలు, మానేరు, గోదావరి నదుల నుంచి ఇసుక తరలింపు, బోడ గుట్టల నుంచి మట్టి తరలింపు వంటి వాటిని పర్యవేక్షించాల్సిన గనులు, భూగర్భ శాఖ అత్యంత కీలకమైనది. కానీ ఈ శాఖకే రెండు నెలలుగా పెద్ద దిక్కు లేకుండా పోయాడు. ఒక్క ఏడీ గాకుండా అసిస్టెంట్‌ జియాలజిస్టు, సీనియర్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం ఒక సర్వేయర్‌, ఒక రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌, ఔట్‌ సోర్సింగ్‌పై ఇద్దరు స్టెనోలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏడీగా పని చేసిన పి శ్రీనివాస్‌ రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు బదిలీ కాగా, ఆయన స్థానంలో మరొక అధికారి రాకపోగా, జగిత్యాల జిల్లా ఏడీ జైసింగ్‌కు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ మైనింగ్‌ ఏడీ పోస్టు ఖాళీగా ఉండటంతో అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నా వాటిని అడ్డుకునే స్థాయిలో నిఘా కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలు రహదారులపై పరుగులు తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

ఫ పారిశుధ్యం అంతంతే..

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, గ్రామపంచాయతీల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా పంచాయతీ అధికారి పోస్టు కూడా ఖాళీగా ఉండటంతో సమస్యలు పెరుగుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, మురుగు కాలువల శుభ్రత, పారిశుధ్య కార్మికుల పనితీరు వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. అయితే కీలక అధికారి లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ డీపీగా పని చేసిన వీరబుచ్చయ్య మార్చి నెలాఖరులో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో జిల్లాకు మరొక అధికారిని నియమించక పోగా, మొన్నటి వరకు ఇన్‌చార్జీగా జడ్పీ సీఈఓ నరేందర్‌ వ్యవహరించగా, ఇటీవల జిల్లా సహకార శాఖాధికారి శ్రీమాలకు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారు. వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయంలో ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

ఫ అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కరువు

మహిళా, శిశు సంక్షేమ శాఖలో జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో) పోస్టు ఖాళీగా ఉండటంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభావం పడుతోంది. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు సేవలు అందించడం, కేంద్రాల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. కీలక అధికారి లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బలహీనపడుతోందనే విమర్శలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డీడబ్ల్యూఓగా పనిచేసిన వేణుగోపాల్‌ రావు పదోన్నతిపై మరొక జిల్లాకు బదిలీ కాగా, డీఆర్‌డీఓ కాళిందినికి ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించారు. డీఆర్‌డీఓలోనే మహిళా సంఘాల బలోపేతం, వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు వీబీజీరామ్‌జీ పనుల పర్యవేక్షణ వంటి పనులు అధికంగా ఉంటాయి. ఈ క్రమంలో సదరు అధికారిణికి డీడబ్ల్యూఓ బాధ్యతలను అప్పగించడం వల్ల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది.

ఫ పని భారంతో ఇన్‌చార్జీలు

కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇప్పటికే ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు ఏ శాఖపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ప్రధాన బాధ్యతలు.. మరోవైపు ఇంచార్జీ బాధ్యతలతో అధికారులపై పనిభారం పెరుగుతోంది. ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, క్షేత్రస్థాయి పర్యవేక్షణలో లోపాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో పూర్తి స్థాయి అధికారులను నియమిస్తేనే పాలన వేగవంతం అవుతుందని ప్రజలు అంటున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ఇంచార్జీలతోనే పాలన సాగిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఖాళీగా ఉన్న ఆయా శాఖల ఉన్నతాధికారుల పోస్టును భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:39 AM