Share News

అంతా ‘కామన్‌’..

ABN , Publish Date - May 20 , 2026 | 12:40 AM

జిల్లాలో ఎన్నడూలేని విధంగా ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని కామన్‌ కింద కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఒక్కో రైతు క్వింటాలు ధాన్యానికి 20 రూపాయలు నష్టపోతున్నారు.

 అంతా ‘కామన్‌’..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో ఎన్నడూలేని విధంగా ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని కామన్‌ కింద కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఒక్కో రైతు క్వింటాలు ధాన్యానికి 20 రూపాయలు నష్టపోతున్నారు. ఎఫ్‌సీఐ అధికారులు బియ్యం తీసుకునే సమయంలో కొర్రీలు పెడుతున్నారని ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని కూడా కామన్‌ గ్రేడ్‌ కింద తీసుకోవాలని జిల్లా అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని కామన్‌ గ్రేడ్‌ కిందనే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీనికితోడు ఆయా కేంద్రాల్లో తరుగు పేరిట ఒక్కో సంచికి 42 కిలోల వరకు తూకం వేస్తున్నారని, క్వింటాలుకు 3 నుంచి 4 కిలోల వరకు నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.

యాసంగి సీజన్‌లో లక్షా 90 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, ఎక్కువ మొత్తంలో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2,35,522.69 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఏ గ్రేడ్‌ కింద 2033.28 టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం 1603.24 టన్నులు, సన్నరకం 429.94 టన్నులు కొనుగోలు చేశారు. కామన్‌ కింద 2,35,092.51 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గతేడాది ఇదే యాసంగి సీజన్‌లో మే నెల 29వ తేదీ వరకు 3,51,925 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా, ఏ గ్రేడ్‌ కింద 1,46,307 టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం 87,134 టన్నులు, సన్నరకం 59,173 టన్నులు ఉన్నాయి. కామన్‌ కింద 2,05,617 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గతేడాది సాగైన పంటలో 25 శాతం వరకు సన్నరకం పంట ఉండగా, దొడ్డురకం వరి పంట 75 శాతం వరకు సాగు చేశారు. ఏ గ్రేడ్‌ కింద సన్నరకం ధాన్యంతో పాటు దొడ్డు రకం 1010, ఐఆర్‌ 64 ధాన్యాన్ని చేర్చారు. ఈ రెండు రకాల పంటను ఈ సీజన్‌లో రైతులు పండించినప్పటికీ, అంతా కామన్‌ కిందనే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు క్వింటాల్‌కు 20 రూపాయలు కోల్పోయారు. ఇప్పటి వరకు కామన్‌ కింద కొనుగోలు చేసిన ధాన్యంలో లక్ష టన్నుల వరకు ఏ గ్రేడ్‌ ధాన్యం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఏ గ్రేడ్‌ కింద తీసుకున్న ధాన్యాన్ని మరఆడించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ అధికారులు గింజ పొడవు లేదని కామన్‌ కింద తీసుకుంటున్నారనే సాకుతో మిల్లర్లు అధికారుల మీద ఒత్తిడి తీసుకవచ్చారని సమాచారం. ఏ గ్రేడ్‌ కింద తీసుకున్న ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తిరస్కరిస్తే మాత్రం క్వింటాలుకు 30 రూపాయల వరకు తాము ప్రభుత్వానికి చెల్లిం చాల్సి వస్తున్నదని మిల్లర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు 80 వేల నుంచి లక్ష టన్నుల వరకు ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని కామన్‌ కిందనే తీసుకుని ఉంటారని అంచనా. ఒక్కో టన్నుకు 200 రూపాయల చొప్పున ఒక కోటి 60 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుండగా, రైతులు నష్టపోతున్నారు.

ఫ అధికంగా తూకం..

ధాన్యంలో తాలు, రాళ్లు ఉన్నాయని జిల్లాలో గల కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఒక్కో సంచి 40.600 కిలోలు తూకం వేయాల్సి ఉండగా, 42 కిలోల వరకు వేస్తున్నారని రైతులు తెలిపారు. ఒక బస్తాకు 1.4 కిలోల చొప్పున క్వింటాలుకు 3.5 కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారని చెప్పారు. దీంతో ఒక క్వింటాలుకు 85 రూపాయల వరకు నష్టపోతున్నామని రైతులు తెలిపారు. మొదట సంచికి 40.600 కిలోలే తూకం వేసినప్పటికీ, కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పెద్ద ఎత్తున జమ కావడంతో రైస్‌ మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేటప్పుడు ఆలస్యం చేశారు. ధాన్యంలో తాలు అధికంగా ఉందని చెబుతూ ట్రక్‌ షీట్‌లో కోతలు విధించడం ఆరంభించారు. సోమవారం రామగిరి మండలం లొంకకేసారం గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఒక సంచికి 42 కిలోల చొప్పున తూకం వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదే రోజున ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్‌ మండలం రేగడి మద్దికుంటలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కొందరు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో 42 కిలోల తూకం వేస్తున్నారని ఎమ్మెల్యేకు చెప్పడంతో ఆయన వెంటనే కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అప్పటికే అక్కడ తూకం వేసి ఉన్న బస్తాల్లో ఒకటి రెండు బస్తాలను తూకం వేయగా, 42 కిలోలు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే సెంటర్‌ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు.. తూకం పేరిట, అటు.. ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని కామన్‌ గ్రేడ్‌ కింద చూపి రైతులను నిలువునా ముంచుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని ఏ గ్రేడ్‌ కిందనే చూపాలని, అదనపు తూకం లేకుండా ధాన్యాన్ని తూకం వేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2026 | 12:40 AM