అంతా.. గోల్‘మ్యూల్’
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:13 AM
కొంతమంది ‘ఈజీమనీ’ కోసం అడ్డదారులుతొక్కుతున్నారు.
కరీంనగర్ క్రైం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కొంతమంది ‘ఈజీమనీ’ కోసం అడ్డదారులుతొక్కుతున్నారు. కష్టపడకుండా, ఎలాంటి శ్రమ కలుగకుండా త్వరగా డబ్బులు సంపాదించాలని ఆశపడినవారు కొందరు.... దళారుల మాటలు విని ఆర్థిక సమస్యలు తీరుతాయని మరికొందరు.... నేరమని తెలిసి కూడా బ్యాంక్ ఉద్యోగులు, చదువుకున్నవారు మరికొందరు.... ఇలా సైబర్ ముఠాల వలలో చిక్కుకుంటున్నారు. అంతర్జాతీయ సైబర్ ముఠాలు చేస్తున్న ఆర్థికపరమైన నేరాలకు ఇటువంటి అమాయకులను వాడుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ ఫేక్ లింక్స్, సందేశాలు ఇన్‌స్టాగ్రాం ద్వారా పంపిస్తూ, ఫోన్ కాల్, వీడియో కాల్స్ చేస్తూ యువకులకు ఎర వేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిన వారికి డబ్బులు, కమిషన్లు ఇచ్చి మ్యూల్ అకౌంట్లు తెరిపించి బ్యాంక్ ఖాతా పుస్తకంతోపాటు, అనుసంధానమైన సిమ్‌కార్డు, డెబిట్ కార్డు, ఇతర వివరాలు సైబర్ నేరగాళ్ల్లు తీసుకుంటున్నారు. అకౌంట్ వివరాలు ఇచ్చిన వారికి మొదట 30 వేల రూపాయలు ముట్టజెబుతారు. ఆ తరువాత ఆ ఖాతాలో జరిగిన ప్రతిలావాదేవికి 2 నుంచి 4 శాతం కమీషన్ ఇస్తుంటారు. ఈజీమనీ ఉచ్చులో పడిన కొందరు యువకులు, బ్యాంక్ ఉద్యోగులు, విద్యావంతులు ఇరుక్కుని కటకటాల పాలవుతున్నారు.
ఫ మ్యూల్ అకౌంట్ల ద్వారా విదేశీ ఖాతాల్లోకి..
సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును వేగవంతచేసి నిందితులను అరెస్టు చేస్తున్నప్పటికీ డబ్బుల రికవరీ శాతం ఆశాజనకంగా ఉండటంలేదు. దీనికి ప్రధానకారణం మ్యూల్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడమే. సైబర్ నేరగాళ్లు ఒక ఫేక్ సందేశాన్ని పంపిస్తారు. ఆ సందేశానికి స్పందించి ఫోన్ చేయగానే తక్కువ సమయంలో రెట్టింపు డబ్బులు వస్తాయని, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా తక్కువధరకు విలువైన వస్తువులు వంటి రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనల గురించి చెబుతారు. ఆ తరువాత మాటల్లోపెట్టి మొదట సైబర్ నేరగాళ్లే వెయ్యి రూపాయలు పంపించి ఆ తరువాత ఓటీపీ చెప్పమంటారు. ఓటీపీ చెప్పగానే ఆ ఖాతాలో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు మ్యూల్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ డబ్బులను నేరగాళ్లు మ్యూల్ అకౌంట్ నుంచి ఇతర అకౌంట్‌లోకి లేదా ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలుకు ఉపయోగిస్తారు. బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో బాధితుడి డబ్బులు మ్యూల్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు గుర్తించి ఆ మేరకు మ్యూల్ అకౌంట్ ఎవరి పేరిట ఉందో ఆ వ్యక్తిపై కేసును నమోదు చేస్తారు. కాని ఆ అకౌంట్‌లో డబ్బులు ఉండడంలేదు. ఆ డబ్బులు వెంటనే 5 స్టెప్‌లలో వివిధ బ్యాంక్ ఖాతాల ద్వారా విదేశాలకు చేరుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ఫ మ్యూల్ అకౌంట్ అంటే....
సైబర్ నేరగాళ్లు స్థానికంగా నియమించకున్న దళారులు, ఏజెంట్లు గ్రామీణ ప్రాంతాల్లోని పేదవర్గాలకు చెందిన అమాయక యువకులను చేరదీసి వారికి డబ్బుల ఆశజూపి వారిచేత బ్యాంక్ ఖాతా తెరిపిస్తారు. ఆ ఖాతాకు సంబంధించిన పాస్‌బుక్, ఏటీఎం కార్డు, సిమ్‌కార్డు, పిన్‌నెంబర్‌తో సహా మొత్తం కిట్‌ను సైబర్ నేరగాళ్లే తీసుకుంటారు. ఆ ఖాతాల ద్వారా అక్రమాలకు పాల్పడతారు.
ఫ ఆపరేషన్ క్రాక్‌డౌన్
కరీంనగర్‌లో పోలీసులు సైబర్ క్రైం కేసులను ఛేదించి, నిందితులను అరెస్టు చేసేందుకు ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ను చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 15న వన్‌టౌన్, టూటౌన్ పోలీసులు 10 కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 27న త్రీటౌన్ పోలీసులు 8 కేసుల్లో మరో 13 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఆర్‌బీఎల్ మేనేజర్, క్యాషియర్లు కూడా ఉన్నారు.
ఫ కరంట్ అకౌంట్‌తో పెద్దమొత్తంలో.....
ఇదివరకు సైబర్ నేరగాళ్లు మ్యూల్ అకౌంట్లను సేవింగ్స్ విభాగంలో మాత్రమే తెరిపించేవారు. సేవింగ్స్ అకౌంట్‌లో 10 లక్షల లావాదేవీలు జరిగితే వెంటనే ఆదాయ పన్ను శాఖకు సమాచారం వెళుతుంది. దీనిద్వారా ఆయా ఖాతాదారుకు నోటీసులు పంపుతారు. ఆ ఖాతా లావాదేవీలపై నిఘా ఉంటుంది. దీంతో మ్యూల్ అకౌంట్‌లను కరెంట్ అకౌంట్లుగా తెరిపించి కోట్ల లావాదేవీలు జరుపుతున్నారు. సాధారణంగా వ్యాపార సంస్థలు, ఇతర సంస్థల నిర్వాహకులు ఆయా సంస్థల పేరిట కరెంట్ అకౌంట్లు నిర్వహిస్తారు. ఈ ఖాతాలకు ఆదాయపన్ను చెల్లింపుదారులే అర్హులు. కరెంట్ అకౌంట్ ఖాతా ఇచ్చేందుకు సదరు వ్యక్తి నిర్వహిస్తున్న వ్యాపార సంస్థ రిజిస్ట్రేషన్ నంబరు, ఐటీ రిటర్న్స్, ఆధార్‌కార్డుతో సహా పలు డాక్యుమెంట్లు అవసరముంటాయి. ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 24 మంది కరెంట్ అకౌంట్ పేరిట మ్యూల్ అకౌంట్‌లు తెరిచారు. వీరెవరికి వ్యాపార సంస్థలు, ఐటీ రిటర్స్న్, రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై డబ్బులు తీసుకుని కరెంట్ అకౌంట్లు ఇచ్చారని పోలీసులుతెలిపారు. సైబర్ నేరగాళ్ళతో ఈ ఇద్దరు బ్యాంక్ అధికారుల వాట్సప్ చాటింగ్, కాల్ రికార్డులు లభించినట్లు తెలిసింది.
ఫ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు సంవత్సరాల్లో 786 సైబర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో యూపీఐ ఫ్రాడ్ 462, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్ 188, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, సిమ్ స్వాప్‌కు సంబందించి 64, ఈ-వాలెట్ 25, డీమాట్ 28, ఫ్రాడ్ కాల్ 15, ఈ మెయిల్‌కు సంబంధించి 3, ఇతరాలు కేసు ఒకటి నమోదైంది.
- 2023 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా సైబర్ మోసాలపై 302 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 32 మంది నిందితులను అరెస్టు చేశారు.
- 2024 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 208 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
- 2025 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 280 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
2025 వరకు 352 సైబర్ కేసుల్లో 1,10,09,444 రూపాయలు రిఫండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫ పరిచయం లేని వారికి బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వొద్దు
- సీపీ గౌస్ ఆలం
పరిచయంలేని వారికి బ్యాంక్ ఖాతాలు ఇవ్వడం, ఇతరుల కోసం ఖాతాలు తెరవడం, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు ఇతరులకు అప్పగించటం చట్టరీత్యా నేరమని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు పనులకుపాల్పడితే సైబర్ నేరాలలో భాగస్వాములుగా కేసులు నమోదు అవుతాయయన్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇవ్వడం, వివరాలు చెప్పడం నేరమని, అలా చేసిన వారిని సైబర్ నేరగాళ్లకు సహకరించిన నేరస్థులుగానే పరిగణిస్తామని సీపీ తెలిపారు. నెలవారీ కమీషన్లు ఇస్తామంటూ, మీ ఖాతాను వినియోగించుకుంటామని చెప్పే వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బ్యాంకు అధికారుల సమన్వయంతో మ్యూల్ ఖాతాదారుల పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి మిగిలిన నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.