Share News

ప్రతీ రోగికి భరోసా కల్పించాలి..

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:49 PM

ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగికి మెరుగైన వైద్యం అందించి భరోసా కల్పించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

ప్రతీ రోగికి భరోసా కల్పించాలి..
సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ నవీనలకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ చిత్రమిశ్రా

సుభాష్‌నగర్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగికి మెరుగైన వైద్యం అందించి భరోసా కల్పించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)ని ఆమె శనివారం సందర్శించారు. కలెక్టర్‌ రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రతకు నిరంతరం ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించేందుకు 6.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాత్‌ ల్యాబ్‌ మిషన్లు, క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. వీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లపై వైద్యాధికారులతో చర్చించారు. ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీన, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఫ మెడికల్‌ కళాశాల భవనాల పనులు వేగవంతంచేయాలి

భగత్‌నగర్‌: ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, హాస్టళ్ల భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కొత్తపల్లిలో నిర్మాణమవుతున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, వసతి గృహాలు, నర్సింగ్‌ కళాశాల భవనాలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల హాస్టల్‌ భవనాలను నెలలోపు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి సంబంధించి మిగిలి ఉన్న పనులపై నివేదిక సమర్పించాలన్నారు. కార్యక్రమంలో టీజీఎంఎస్‌ఎస్‌ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 11:49 PM