Share News

అక్టోబరు వచ్చినా.. మీనమేషాలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:01 AM

చేప చేప.. చెరువుకు ఎందుకు చేరలే’.. అంటే సవాలక్ష కారణాలున్నాయనే పరిస్థితి జిల్లాలో నెలకొంది.

అక్టోబరు వచ్చినా..  మీనమేషాలు

- జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లలు విడుదల చేయని అధికారులు

- అదను దాటుతోందని మత్స్యకారుల ఆందోళన

- సగం నిండితేనే పెంపకం

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

’చేప చేప.. చెరువుకు ఎందుకు చేరలే’.. అంటే సవాలక్ష కారణాలున్నాయనే పరిస్థితి జిల్లాలో నెలకొంది. దాదాపుగా వానాకాలం చివరిదశకు చేరినా జిల్లాలోని ఒక్క చెరువులోకి చేప పిల్ల చేరలేదు. మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధికి ఆసరాగా నిలిచే ఈ ప్రక్రియ విషయంలో విపరీతమైన ఆలస్యం జరుగుతోంది. టెండర్ల నిర్వహణలో ఆలస్యం జరుగుతోంది. దీనికి తోడుగా రాష్ట్రస్థాయి నుంచి అందే మార్గదర్శకాల విషయంలో పదే పదే మార్పులు చోటు చేసుకుంటుండటంతో జిల్లా అధికారులు ఆచితూచి అడుగేస్తున్నారు. ఉత్పత్తిపై ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఆశించిన విధంగా చెరువుల్లో నీళ్లు చేరలేదు. ఎప్పటిలాగే ఈసారి లక్ష్యాన్ని గణనీయంగా పెంచుకుని రెండు కోట్ల పిల్లలను నీళ్లల్లో వదలాలని నిర్ణయించినా.. ప్రస్తుతం అదను దాటిన దృష్ట్యా వీలైనంత తక్కువ లక్ష్యంతోనే ముందుకెళ్లే యోచనలో మత్స్యశాఖ అధికారులున్నారు.

ఫ 308 చెరువుల్లోనే..

అక్టోబరు రెండో వారం దాటుతున్నా.. జిల్లాలో చేపపిల్లల పంపిణీ విషయంలో మీనమేషాల్ని లెక్కించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1015 చెరువులకుగానూ ఈసారి 308 చెరువుల్లోనే వీటిని పెంచాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇటీవల రాష్ట్రస్థాయి అధికారులు ఇచ్చిన సూచన ప్రకారం కనీసం 50 శాతం నీళ్లున్న చెరువుల్లోనే చేపలు పెంచాలనే నిర్ణయించారు. ఏఏ చెరువుల్లో ఎంపిక చేయాలనే విషయమై తాజాగా జాబితాను రూపొందించి ఉన్నతాధికారులకు పంపించారు. గతంలో ఉన్న లక్ష్యం స్థానంలో కేవలం 1.17కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదలాలని భావిస్తున్నారు. రీంనగర్‌ ఎల్‌ఎండీ జలాశయంలో వీలైనన్ని ఎక్కువగా చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తపల్లి చెరువుతోపాటు రాబోవు రెండు నెలల్లో నీళ్లు తగ్గకుండా ఉండే వాటికి ప్రాధాన్యమిస్తున్నారు.

ఫ కాంట్రాక్టర్లు ముందుకొస్తేనే..

జిల్లాలో నిర్ణయించుకున్న లక్ష్యం ప్రకారం 30 లక్షల చేప పిల్లలను జిల్లా మత్స్యశాఖ పరిధిలో పెంచుతున్న చేపపిల్లల పెంపకం కేంద్రం నుంచి తీసుకుంటారు. ఇవి పోనూ మిగతా 87 లక్షల చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. వీరి పంపిణీ విషయంలో సాధ్యాసాధ్యాలను అధికారులు వెళ్లి పరిశీలించారు. వీరు ఫర్ఫార్మెన్స గ్యారెంటీ కింద చెల్లించాల్సిన మొత్తం ఇంకా చెల్లించలేదు. అది చెల్లించిన తర్వాతనే టెండరింగ్‌ విధానం కొలిక్కి వచ్చే వీలుంది. ఈ విషయంలో ఇంకొంత సమయం పట్టే అవకాశమున్నట్లు ప్రస్తుత పరిస్థితిని చూసే అర్థమవుతోంది. మరోవైపు చేప పిల్లలను చెరువుల్లో పోసి కొన్ని నెలల తర్వాత వేడిని తట్టుకోలేక ఎక్కువ శాతం అవి చనిపోయే ప్రమాదముందని అధికారులు పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోట్లాది రూపాయలను వెచ్చించే ప్రజాధనాన్ని వృఽథా చేయొద్దనే ఇలా జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మత్స్యకారులు మాత్రం అదును దాటుతుందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసిన ఆగస్టు, సెప్టెంబరులోనే వీటిని చెరువుల్లో పోసి ఉంటే తమకు వాటి ఉత్పత్తి విషయంలో ఆశ ఉండేదనే భావనను వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 13 , 2026 | 01:01 AM