ఇల్లు పూర్తయినా... బిల్లులెప్పుడు
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:29 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా కొద్దిపాటి మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసినా చివరి విడత బిల్లు అందని పరిస్థితి కనిపిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ఇళ్ల నిర్మాణ పథకాలను కలిపి అమలు చేస్తూ బిల్లులు చెల్లిస్తున్న నేపథ్యంలోనే ఆలస్యం జరుగుతున్నదని చెబుతున్నారు.
- 10,251 ఇళ్లలో 2,069 పూర్తి
- చివరి దశ బిల్లుల బకాయి రూ.20 కోట్లు
- రెండవ విడత మంజూరు కోసం నిరీక్షణ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్ )
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా కొద్దిపాటి మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసినా చివరి విడత బిల్లు అందని పరిస్థితి కనిపిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ఇళ్ల నిర్మాణ పథకాలను కలిపి అమలు చేస్తూ బిల్లులు చెల్లిస్తున్న నేపథ్యంలోనే ఆలస్యం జరుగుతున్నదని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో 10,251 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 2,069 ఇళ్లు మాత్రమే పూర్తికాగా చివరి విడతగా చెల్లించే 1,60,000 రూపాయల మేర బిల్లు అందక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం అప్పుతెచ్చి పనులు పూర్తిచేసిన వారు వడ్డీ పెరుగుతుందని వాపోతు న్నారు. జిల్లాలో సుమారు 20 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా జిల్లాలో 2,04,625 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అధికారులు 77,105 మంది పక్కా ఇళ్లు లేకుండా ఇంటి స్థలాన్ని కలిగి ఉన్నారని, 49,003 మంది పక్కా ఇళ్లు, ఇంటి స్థలం కూడా లేకుండా ఉన్నారని గుర్తించారు. అలాగే 78,517 మందికి పక్కా ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. గ్రామసభల్లో మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉండి పక్కా ఇల్లు లేనివారి నుంచి లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాలోని 16 మండలాలు, కరీంనగర్ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలలో 10,251 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో ఈ రోజు వరకు 8,551 ఇళ్లకు మాత్రమే మార్కవుట్ ఇచ్చారు. వీటిలో 7,359 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా 1,119 ఇళ్ల నిర్మాణ పనులు బేస్‌మెంట్ వరకు పూర్తయ్యాయి. 637 ఇళ్ల పనులు రూఫ్ లెవల్ వరకు, 3,534 ఇళ్లు స్లాబ్ వరకు ప్రగతిలో ఉన్నాయి. 2,069 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణ పనులకు దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నారు.
ఫ చివరి దశ బిల్లుల ఆలస్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకాలను కలిపి ఆయా పథకాల కింద రెండు ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధుల నుంచి లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తున్నారు. 5 లక్షల రూపాయల నిర్మాణ వ్యయంలో ఉపాధిహామీ పథకం ద్వారా 90 పనిదినాలకు 27,500, మరుగుదొడ్డి నిర్మాణానికి 12,000, మరో 1,20,000 రూపాయలను ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం నుంచి మిగతా 3,40,000 రాష్ట్ర ప్రభుత్వం పథకం నుంచి చెల్లింపులు చేస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో మరో 28,000 రూపాయలు అదనంగా పట్టణ ఆవాస యోజన పథకం ద్వారా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెస్మింట్ లెవల్, రూఫ్‌లెవల్, స్లాబ్ లెవల్‌లో పనులు పూర్తయిన తర్వాత దశలవారీగా 3,40,000 రూపాయలను చెల్లించి మిగతా 1,60,000కు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు లింక్ చేశారు. దీనితో చివరి దశ బిల్లులు చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద వెచ్చిస్తున్న 27,500 రూపాయలు, మరుగుదొడ్డి నిర్మాణ నిధులు కొందరికి అందుబాటులోకి వచ్చినా ఆవాస్‌యోజన పథకం నుంచి చెల్లిస్తున్న 1,20,000 రూపాయలు ఇళ్లు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు ఇంకా అందలేదని వాపోతున్నారు. 2069 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసుకున్న లబ్ధిదారులందరి పరిస్థితి ఇలాగే ఉన్నది. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు సుమారు 20 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఫ రెండవ విడత మంజూరుకు ఎదిరిచూపు
రెండవ విడతలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చి గుడిసెలు లేని తెలంగాణ స్థాపించడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. నియోజకవర్గానికి రెండు వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని ఇందులో 1500 ఇళ్లు కొత్త లబ్ధిదారులకు కేటాయిస్తూ 500 ఇళ్లను గతంలో ఇళ్ల నిర్మాణ పనులు రూఫ్‌లెవల్ వరకు పూర్తిచేసుకున్న వారికి స్లాబ్ వేసుకోవడం కోసం డబ్బులు ఇస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంకా లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. పూరిగుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్న ప్రభుత్వం అలాంటి వారి గుర్తింపు చేపట్టిందా అన్నది ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో పక్కా ఇళ్ళు, ఇంటి స్థలం లేనివారి నుండి ఈ గుడిసెవాసులను ఎంపిక చేస్తారా.., లేక ఇంటి స్థలం కలిగి ఉండి గుడిసెలో జీవిస్తున్నవారికి ఇస్తారా అన్న విషయంలో ఇప్పటికీ అధికార వర్గాల్లో స్పష్టత లేకుండా పోయింది. రెండవ విడత ఇళ్లను వెంటనే మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టేలా చూడాలని, అలాగే మొదటి విడతలో ఇళ్లు పూర్తి చేసుకున్న వారందరికీ ఎలాంటి జాప్యం లేకుండా డబ్బులు మొత్తం చెల్లించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.