30 వరకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించాలి
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:03 AM
ఓటర్లు ఉన్న ప్రతి కుటుంబానికి ఈనెల 30 వరకు ఎన్యూమరేషన్ పత్రాలను అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బీఎల్‌వోలను ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట, జూన్25(ఆంధ్రజ్యోతి): ఓటర్లు ఉన్న ప్రతి కుటుంబానికి ఈనెల 30 వరకు ఎన్యూమరేషన్ పత్రాలను అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బీఎల్‌వోలను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం పరిధిలో గురువారం ప్రారంభమైన ఫారాల పంపిణీ ప్రక్రియను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పత్రాలు తీసుకున్న పలువురు ఓటర్లతో మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారానికి ఓటరుకు సంబంధించిన పాస్‌పోర్టు సైజ్ ఫోటో అతికించడంతో పాటు వివరాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు అందించాలని అన్నా రు. ఓటర్లు ఫారాలు నింపడంలో బూత్ లెవల్ అధికారులు సహాయం చేయాలని సూచించారు. జూలై 24వ తేదీలోగా పూర్తి చేసిన ఫారాలను తీసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ గరిమ అగ్రవాల్ హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలోని పరిసరాలు, అందిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వ, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఏ విధమైన వైద్య సేవలు అందుతున్నాయోనని రోగులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది నిరంతరం 24 గంటల పాటు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా చూడాలని అన్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. వ్యాక్సినేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ఆర్డీవో శ్రీధర్‌బాబు, తహసీల్దార్ సుజాత, ఆసుపత్రి సూపరిండెంట్ రఘు, తదితరులు ఉన్నారు.