Share News

ప్రవేశాల జోష్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:40 AM

ఒకవైపు కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలల పోటాపోటీ క్యాంపెయినింగ్‌, ఇంకోవైపు గురుకులాల్లో వసతితో కూడిన ఉచిత విద్య ఉన్నప్పటికీ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ యేడాది ప్రవేశాలు పెరుగుతున్నాయి.

ప్రవేశాల జోష్‌

జగిత్యాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలల పోటాపోటీ క్యాంపెయినింగ్‌, ఇంకోవైపు గురుకులాల్లో వసతితో కూడిన ఉచిత విద్య ఉన్నప్పటికీ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ యేడాది ప్రవేశాలు పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఇప్పటికే 2,692 మంది విద్యార్థులు ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందారు. గత విద్యా సంవత్సరం (2025-26)లో 2,850 మంది విద్యార్థులున్నారు. ఈసారి 158 మంది విద్యార్థుల ప్రవేశాలు జరపడంతో పాటు 20 శాతం అదనంగా ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇంటర్‌ కళాశాలల్లో ప్రవేశాల్లో రాష్ట్రంలో హైదరాబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలో, సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉండగా, జగిత్యాల జిల్లా 9వ స్థానంలో ఉందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

ఫ ప్రవేశాలు ఇంకా పెరిగే అవకాశం..

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంకా ప్రవేశాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో కార్పొరేట్‌ కళాశాలలు, కేజీబీవీలు, ఎంజేపీ కళాశాలలు, గురుకుల కళాశాలలు వచ్చిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు వసతి సౌకర్యంతో కూడిన విద్య కోసం వాటిని ఎంచుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో చాలా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. జిల్లాలో మాత్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ఆదరణ పెరుగుతోంది.

ఫగడువు పొడిగింపు..

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు గతంలో జూన్‌ 30వ తేదీ వరకు గడువు ఉండేది. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు అధికారులు గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. దీంతో ఇంకా చాలా మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉందని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు.

ఫకళాశాలల్లో మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు పెరగడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే ప్రకటన చేయడం, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌, బూట్లు, దుస్తులతో కూడిన ఉచిత కిట్‌లు అందించే నిర్ణయం తీసుకోవడం కారణంగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్‌ కళాశాలల్లో మాదిరిగానే జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు, స్టడీ మెటీరియక్‌ అందించడం, సొంత భవనాలు, ఆధునిక ప్రయోగశాలలు ఉండడం, ఏటా మంచి ఫలితాలు సాధించడం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి.

ప్రవేశాల పెంపునకు కృషి

- బొప్పరాతి నారాయణ, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 2,692 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించాం. దీంతో రానున్న రోజుల్లో ఇంకా ప్రవేశాలు పెరుగుతాయని ఆశిస్తున్నాము.

కళాశాలల వారీగా ప్రవేశాలు..

---------------------------------------------------

కళాశాల..విద్యార్థులు

---------------------------------------------------

జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ - 345

జగిత్యాల (బాలికలు) - 375

సారంగాపూర్‌ - 87

మెట్‌పల్లి - 214

కథలాపూర్‌ - 151

ఇబ్రహీంపట్నం - 94

ధర్మపురి - 148

బీర్‌పూర్‌ - 107

మల్లాపూర్‌ - 86

రాయికల్‌ - 127

మల్యాల - 115

గొల్లపల్లి - 143

కోరుట్ల (బాలికలు) - 98

కోరుట్ల - 381

కొడిమ్యాల - 139

మేడిపల్లి - 82

---------------------------------------------------

మొత్తం - 2,692

---------------------------------------------------

Updated Date - Jul 10 , 2026 | 12:40 AM