Share News

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:21 AM

ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కొనుగోళ్లలో అవకాశాలు కల్పించేందుకు రామగుండం ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక వెండర్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం నిర్వహించారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
మాట్లాడుతున్న ఎన్టీపిసి ఇడి ఫైజ్‌ తయ్యబ్‌

- ఎన్టీపీసీలో టెండర్లు, వ్యాపార అవకాశాలపై అవగాహన

జ్యోతినగర్‌, నవంబరు16(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కొనుగోళ్లలో అవకాశాలు కల్పించేందుకు రామగుండం ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక వెండర్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం నిర్వహించారు. పరిశ్రమల స్థాపన, ఎన్‌టీపీసీ టెండర్లలో పాల్గొనే విధానం, భవిష్యత్తులో అందుబాటులో ఉండే వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించారు. ఎన్‌టీపీసీ ఈడీ ఫైజ్‌ తయ్యబ్‌ మాట్లాడుతూ సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. ఎన్‌టీపీసీ టెండర్లలో చురుగ్గా పాల్గొని సంస్థతో వ్యాపార భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంఎస్‌ఎంఈ, డీఎఫ్‌ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమతి, ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్‌ఓ హెడ్‌ సురేశ్‌, డీఐసీసీఐ తెలంగాణ చాప్టర్‌ అధ్యక్షుడు సీతారాం ప్రసంగించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. కాంట్రాక్ట్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ విభాగానికి చెందిన శివకుమార్‌ పెనుగొండ, అమన్‌ పాండే ఎంఎస్‌ఈల కొనుగోళ్ల విధానంపై వివరించారు. వెండర్‌ నమోదు, బూడిద రవాణా అవకాశాలపై డీజీఎం మేడా నాగరాజు, జీఈఎం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌, బిడ్లలో పాల్గొనే విధానంపై జీఈఎం శిక్షకురాలు అహోనా మజుందార్‌, వెండర్‌ ఇన్వాయిస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌పై డీజీఎం బట్టు కిషన్‌ అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన ముఖాముఖి చర్చలో పారిశ్రామికవేత్తలు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఏజీఎం రాకేశ్‌ ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:21 AM