Share News

రూపు మారిన ‘ఉపాధి’

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:34 AM

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

రూపు మారిన ‘ఉపాధి’

జగిత్యాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ప్రారంభించిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చట్టం స్థానంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (వీబీజీ రామ్‌జీ) తీసుకు వచ్చింది. ఈ పథకం జూలై నుంచి అమలులోకి వచ్చింది. ఇక నుంచి ఈ పథకంలో చేపట్టే పనులకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పని దినాలను కూడా వంద నుంచి 125 రోజులకు పెంచింది.

ఫజిల్లాలో కూలీల సంఖ్య 2.73 లక్షలు

జిల్లాలో 1.67 లక్షల జాబ్‌కార్డులు, 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకంలో ఉపాధిహామీ పథకంలో కూలీలకు కలిగిన ఇబ్బందులను తొలగించడంతో పాటు అనేక మార్పులు, చేర్పులు చేసింది. గతంలో ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 75 శాతం నుంచి 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నుంచి 25 శాతం వెచ్చించేవి. వీడీ జీరామ్‌ జీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చేలా మార్పులు చేశారు.

ఫపని దినాలు 125కు పెంపు...

కేంద్ర ప్రభుత్వం 2025లో వీబీ జీరామ్‌జీ చట్టం రూపొందించి చట్ట సభల్లో ఆమోదించింది. దీని ప్రకారం గతంలో కూలీలకు 100 రోజులు పని దినాలు కల్పిస్తే కొత్త చట్టంలో వాటిని 125 రోజులకు పెంచారు. కూలీలకు సమయానికి వేతనాల చెల్లింపు, ఒకవేళ ఆలస్యమైతే వేతనంతో పాటు పరిహారం చెల్లిస్తారు. కూలీలకు 15రోజుల్లో పనులు చూపకపోయినా నిరుద్యోగ భృతి వారి ఖాతాల్లో జమ అవుతుంది.

ఫపనుల విభజన...

ఈ పథకంలో పనులను నాలుగు విభాగాలుగా విభజించారు. వీబీ జీ రామ్‌ జీ ద్వారా గ్రామాల్లో చేపట్టే అన్ని పనులను గ్రామ పంచాయతీ ప్రణాళికలో నమోదు చేస్తారు. దాంతో చేసిన పనులు మళ్లీ మళ్లీ చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరుగుతుంది. అక్రమాలకు అవకాశం ఉండదు. వ్యవసాయంలో 50 శాతం పనులు చేపట్టే వీలు ఉంది. పంటల సాగులో విత్తనాలు వేయడం, పంట కోతల పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించుకునే వీలును కల్పించారు. 60 రోజుల పాటు వ్యవసాయ పనులు సజావుగా జరిగే విధంగా అవకాశం కల్పించారు.

ఫకొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులు..

వీబీ రామ్‌ జీ పథకంలో భాగంగా కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులు జారీ చేసేలా నిబంధనలు పొందుపరిచారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వారికి, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌ గార్‌ గ్యారెంటీ కార్డులు అందిస్తారు. ఆరు నెలలకు ఒకసారి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డుల స్థానంలో గ్రామీణ రోజ్‌ గార్‌ గ్యారెంటీ కార్డులను ఇవ్వనున్నారు. కార్డు కాలపరిమితి మూడేళ్లు ఉంటుంది. ప్రత్యేక వర్గాలకు స్పెషల్‌ కార్డులు మంజూరు చేస్తారు. ప్లానింగ్‌ విధానంలో మార్పులతో రాష్ట్రాలకు లేబర్‌ బడ్జెట్‌ ఉండే అవకాశాలు లేవు. కేంద్రం నుంచే నిధులను నిర్ధేశించనున్నారు. డిమాండ్‌ పెరిగితే అదనపు ఖర్చును రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. ఉపాధి పథకం నిర్వహణలో ఏదైనా లోపాలు జరిగితే గతంలో రూ.వెయ్యి జరిమానా విధించేవారు. కొత్త పథకం ద్వారా జరిమానాను రూ.10 వేలకు పెంచారు. ఈ పథకం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే విషయమై కూలీల్లో అయోమయం నెలకొంది.

ఫఉద్యోగుల హోదాల్లో మార్పులు..

ఉపాధి హామీ పథకం కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఏపీవోలు, ఇంజనీరింగ్‌, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు వీబీ జీరామ్‌జీ పరిధిలోకి వచ్చారు. ఉద్యోగుల హోదాలు కూడా మారనున్నాయి. ఉపాధి హామీ పథకంలో పని చేసిన సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు, అకౌంట్స్‌ అసిస్టెంట్లు ఇకపై డిజిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్లుగా మారనున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను గ్రామీణ రోజ్‌గార్‌ సహాయక లేదా గ్రామ కాయ కల్ప సహాయక్‌గా, టెక్నికల్‌ అసిస్టెంట్లను రూరల్‌ ఈన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసోసియేట్‌గా పిలుస్తారు. ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు మిషన్‌ ఇంజనీరింగ్‌ అసోసియేట్‌గా మారనున్నారు. అడిషనల్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల హోదా అసిస్టెంట్‌ మిషన్‌ మేనేజర్‌గా మారుతుంది.

ప్రభుత్వ నిర్ణయం మేరకే...

-రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉపాధిహామీ పథకాన్ని వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (వీబీజీ రామ్‌జీ) పథకంగా అమలు చేస్తున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పథకం నిర్వహణ లక్ష్యం మేరకు జరుపుతాము.

---------------------------------------------------------------------------------

జిల్లాలో వివరాలు ఇలా...

జాబ్‌ కార్డుల సంఖ్య....1.67 లక్షలు

జాబ్‌ కార్డుల్లోని కూలీల సంఖ్య...2.73 లక్షలు

శ్రమ శక్తి సంఘాల్లోని కుటుంబాల సంఖ్య...1.05 లక్షలు

శ్రమ శక్తి సంఘాల్లోని కూలీల సంఖ్య...1.46 లక్షలు

Updated Date - Jul 03 , 2026 | 12:34 AM