ఎల్‌నినోపై ‘ఉపాధి’ అస్త్రం
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:59 AM
ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ఉపాధి అస్ర్తాన్ని సంధించేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతోంది.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ఉపాధి అస్ర్తాన్ని సంధించేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 24వ తేదీనుంచి 26వ తేదీ వరకు జిల్లాలోని ఉపాధి హామీ పథకంలోని సిబ్బందికి శిక్షణ తరగతుల్ని నిర్వహించనున్నారు. కరీంనగర్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో అన్ని జిల్లాలో కరువు ఛాయలు ఎదురుకావడంతో గ్రామీణ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతారని పంచాయతరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండురోజుల క్రితం ఉపాధి పనులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక(వీజీపీపీ)లను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తుండగా వాటిని సమగ్రంగా కొనసాగించడంతో పాటు కొత్తగా ఇంకొన్ని అంశాలపై దృష్టిసారించే విధంగా ఆదేశాల్ని జారీ చేశారు. అసలు ఏ ఒక్క కూలీ కూడా పనిలేకుండా ఖాళీగా ఉండకూడదని కొత్తగా మరికొన్ని గైడ్లైన్సను రాష్ట్రస్థాయి అధికారులు అందించారు. ఊళ్లల్లో మరిన్ని కొత్త పనుల్ని గుర్తించాలని ఆదేశించారు. కూలీలకు చేతినిండా పనిదొరికే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
కార్యాచరణ ఇలా..
సెప్టెంబర్ 24- 26 : సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు
సెప్టెంబర్ 27-30 : ముందస్తు ప్రణాళిక రూపకల్పన
అక్టోబర్ 2న : గ్రామసభ నిర్వహణ, పనుల ఆమోదం
బ్యాచలుగా ఏర్పాటు
వీబీ-జీ రామ్ జీ చట్టం-2025ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలతో రాష్ట్రస్థాయి అధికారులు ఇటీవల నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. ముందుగా ఉపాధి హామీ పనులను పక్కాగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషించే సిబ్బందికి మూడురోజుల పాటు శిక్షణ ఇస్తారు. అక్టోబరు 1వ తేదీ నుంచి 2027 జూన వరకు ప్రతి గ్రామంలో కూలీలందరికీ పని కల్పించాలనే లక్ష్యం, పనుల ఎంపిక తదితర విషయాలపై శిక్షణ ఇస్తారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి సిబ్బందిని బ్యాచలుగా ఏర్పాటు చేసి శిక్షణ కొనసాగిస్తారు. ఇదే సమయంలో సర్పంచలు, పంచాయతీ కార్యదర్శులను ఒక బ్యాచగా ఏర్పాటు చేసి వారికి తర్ఫీదునిస్తారు. ఎలాంటి ప్రాధాన్యతలను గుర్తించాలనే విషయంతో పాటు ఇప్పుడు ఉపాధి హామీలో పనులు సక్రమంగా ఎందుకు జరగడం లేదనే కోణంలో వాస్తవాల్ని వివరిస్తారు. అవసరమైన జాగ్రత్తల్ని తెలుపుతూనే ఎల్‌నినో వల్ల రాబోవు రోజుల్లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమగ్రమైన అవగాహన కల్పిస్తారు. కరువు ప్రభావాన్ని తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుందనే విషయమై ప్రణాళికల్ని సిద్ధం చేయిస్తారు.
ఫ పనుల గుర్తింపుపై వాస్తవ పరిస్థితులు
గ్రామంలో అసలు పనులు చేపట్టడానికి ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తారు. ఏ రకమైన పనులను గుర్తించవచ్చనే సమాచారంతో ప్రత్యేకమైన మ్యాప్‌ను సిద్ధం చేస్తారు. సాధ్యమైన పని ప్రదేశాల ఎంపిక చేపడుతారు. ఉద్యానవనాలు, వ్యవసాయ అనుబంధం, మొక్కల పెంపకం, అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పనుల గుర్తింపు చేపడుతారు. ఎక్కువగా కొత్త పనులకు అనుమతి లభించే విధంగా వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. నీటి భద్రత ఆధారంగా గుర్తించిన పనులకు సంబంధించి అక్టోబర్ 2వ తేదీన గ్రామసభ పెట్టి అందులో పనులను తీర్మానించాలి. గ్రామస్తుల సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి ఎల్‌నినో ముప్పును తట్టుకునే విధంగా ఉపాధిని అందించనున్నారు.