Share News

ఆందోళన బాటలో ఉద్యోగులు

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:08 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.

ఆందోళన బాటలో ఉద్యోగులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. పీఆర్సీని వెంటనే అమలు చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెం డింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని, హెల్త్‌ కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతు న్నాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని, జీవోనం.25ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. జీవో నం.190ను అమలు చేయడంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ఇతర పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 4వేలకు పైగా ఉండగా, 650 మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరే గాకుండా 5 వేల మంది కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు.

దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు

సమస్యల పరిష్కారానికి టీజీజేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1న పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సెప్టెంబరు 10న ’చలో హైదరాబాద్‌‘ పేరుతో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలను ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

కలెక్టర్‌కు వినతి

ఆందోళన కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగానికి ముం దస్తు సమాచారం అందిస్తూ కలెక్టర్‌కు గురువారం తెలం గాణ ఎంప్లాయీస్‌ జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సంబంధిత శాఖల ఉద్యోగులకు ముందస్తు సమాచారం అందించి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ధర్నాలు, నిరసనల సందర్భంగా పోలీస్‌ బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, ఇతర పరిపాలనా సహకారం అందించి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుం దనే ఆశాభావంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

పీఆర్సీ అమలు చేయాలి..

బొంకూరి శంకర్‌, జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్‌.

ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాకపోవడం, ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ పునరుద్ధరణపై ఇచ్చిన హామీ అమలులోనూ జాప్యం జరుగుతోంది. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు, ఆరోగ్య పథకం సమస్యలను వెంటనే పరిష్కరించి ఆర్థిక ఇబ్బం దులు తొలగించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

ఉద్యోగుల హక్కులను గుర్తించాలి

తూము రవీందర్‌, టీజీఈజేఏసీ, జిల్లా కన్వీనర్‌

ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ, వివిధ బిల్లులను వెంటనే చెల్లించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి. కుటుంబ, ఉద్యోగ బాధ్యతలతో సతమతమవుతున్న ఉద్యోగులపై అధికారుల వేధింపులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే ఉద్యోగుల ఐక్యశక్తిని ప్రజాస్వామ్య పద్ధతిలో చూపిస్తాం.

Updated Date - Aug 21 , 2026 | 01:08 AM