ఖరీఫ్‌పై ఎల్‌నినో దెబ్బ
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:43 AM
ఎల్‌నినో ఖరీఫ్ ఆశలను గల్లంతు చేస్తున్నది.
- జాడ లేని వానలు
- 45 శాతం లోటు వర్షపాతం
- నాటేసింది 20 శాతమే
- పత్తి సాగుచేసినా... ఆశలు అంతంతే
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఎల్‌నినో ఖరీఫ్ ఆశలను గల్లంతు చేస్తున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వానా కాలం సాగు ముందుకు సాగడం లేదు. వరి, పత్తి సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. 45 శాతం లోటు వర్షపాతంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. రాబోయే రోజుల్లో తాగునీటికి తీవ్ర సమస్య తప్పదనే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. కాలంపైనే భారం వేసి ఉన్న కొద్దిపాటి భూగర్భ జలాలతో నాట్లేసుకున్న పొలాలకు నీరందడం లేదు. పత్తి మొక్కలు వడలిపోతున్నాయి. కొద్దిరోజుల్లో వర్షం కురవకపోతే వాటిపై కూడా ఆశలు వదులుకోవలసిందే..
ఫ 95,391 ఎకరాల్లో సాగు
జిల్లాలో 3.50 లక్షలకు పైగా ఎకరాలలో వివిధ పంటలను సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తే ఇప్పటి వరకు 95,391 ఎకరాల్లో వరి, పత్తి, పప్పుదినుసులు సాగు చేశారు. బావుల ఆధారంగా నార్లు పోసుకున్న వారు 54వేల ఎకరాల్లో నాటు వేశారు. 2,79,000 ఎకరాల్లో సాధారణంగా ప్రతి వర్షాకాలం వరి సాగు జరుగుతుంది. ఈ విస్తీర్ణం మేరకు సాగుకు సన్నద్ధమైన రైతులు వరి నార్లు పోసుకున్నా వర్షాలు లేక నాట్లు వేయడ లేదు. ఇప్పటికే నార్లు ముదిరిపోతున్నాయి.
ఫ అన్ని మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితులే..
నైరుతి రుతుపవనాల కాలం జూన్ మొదటి నుంచి సెప్టెంబరు చివరి వరకు ఉంటుంది. ఇప్పటికి 50 రోజులు గడవగా 13 రోజులు మాత్రమే అక్కడక్కడ వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లోకూడా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పటి వరకు గడిచిన 50 రోజుల్లో 263 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదుకావలసి ఉండగా కేవలం 145.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 45శాతం లోటు వర్షపాతం నమోదవడంతో అన్ని మండలాల్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
ఫ పత్తి, మొక్కజొన్నదీ అదే పరిస్థితి
అడపాదడపా కురిసిన వర్షాలతో 38,506 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. కొన్ని చోట్ల వర్షాభావపరిస్థితుల కారణంగా విత్తనాలుమొలకెత్తక పోవడంతో మళ్లీ విత్తనాలు పెట్టారు. పెట్టుబడి ఖర్చులు తడిసి మోపడైనా పంట పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. బావుల కింద పత్తివేసిన వారు ప్రస్తుతానికి కొందరు బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీరందిస్తుంటే కొందరు బిందెల ద్వారా నీరుపోస్తూ వాటిని దక్కించుకుంటున్నారు. వర్షభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఒక్క ఎకరంలోనూ పంట పండే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4,500 ఎకరాల్లో సాగు కావలసిన మొక్కజొన్నను 2,356 ఎకరాల్లోనే సాగుచేశారు. 510 ఎకరాల్లో కంది, పెసర పంటలు వేశారు. గడిచిన నాలుగు రోజులుగా అల్పపీడన ప్రభావంతో కాస్త మబ్బులు రాగా వర్షాలు కురుస్తాయని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది.
ఫ ప్రత్యామ్నాయంపైనా ఆశలు లేవు..
ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి ఆరుతడి పంటలే సాగు చేయాలని, జొన్నలు, చిరుదాన్యాలు, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సాగుపై కూడా ఆశలు కనిపించడం లేదు. వేసిన విత్తనాలు చేతికొస్తే చాలు అనే అభిప్రాయమే అంతటా వినిపిస్తూ రాబోయే కరువు పరిస్థితులు అప్పుడే అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.