ఎన్నికల వేళ.. చేతి నిండా పని..
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:57 AM
మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని పలు వర్గాలకు చేతినిండా పని దొరుకుతున్నది. రోజువారీ కూలీల నుంచి మొదలు ఇతర వృత్తి వ్యాపారస్తులకు వందలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రచారాల కోసం పలువురు అభ్యర్థులు కూలీలను ఆశ్రయిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తమ డివిజన్, వార్డు పరిధిలోనే ఉండే మహిళలనే ప్రచారానికి పిలుస్తున్నారు.
- ప్రచారానికి రోజువారీ కూలీలు
- రూ.300నుంచి రూ.500వరకు చెల్లింపు
- డప్పు కళాకారులు, టెంట్‌హౌస్‌లు, హోటళ్లకు గిరాకీ
- అద్దె వాహనాలకు డిమాండ్, జోరుగా మద్యం అమ్మకాలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని పలు వర్గాలకు చేతినిండా పని దొరుకుతున్నది. రోజువారీ కూలీల నుంచి మొదలు ఇతర వృత్తి వ్యాపారస్తులకు వందలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రచారాల కోసం పలువురు అభ్యర్థులు కూలీలను ఆశ్రయిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తమ డివిజన్, వార్డు పరిధిలోనే ఉండే మహిళలనే ప్రచారానికి పిలుస్తున్నారు. పట్టణాల్లో ఉండే కూలీలే కాకుండా సమీప గ్రామాల్లోని కూలీలను కూడా రప్పిస్తున్నారు. ర్యాలీల సందర్భంగా.. డప్పు కళాకారులకు, వాడవాడలా ప్రచారం చేసేందుకు అద్దెవాహనాలకు, సభలు, సమావేశాల కోసం టెంట్‌హౌస్ యజమానులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు టిఫిన్లు, భోజనాలు చేయిస్తుండడంతో హోటళ్లకు, మద్యం షాపులకు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు సాధారణ సమయంలో తీసుకుంటున్న చార్జీల కంటే కాస్త ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.
ఫ కూలీలకు దొరికిన పని..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో ఉండే కూలీలకు ఉపాధి లభిస్తోంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో ఉదయం సాయంత్రం ప్రచారం చేసే సమయంలో పార్టీల జెండాలను పట్టుకొని తిరుగుతూ జై కొడుతున్నారు. ఇందుకోసం అభ్యర్థులు కూలీలకు 300నుంచి 500రూపాయల వరకు చెల్లిస్తున్నారు. నామినేషన్ల గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రచారానికి పెద్దఎత్తున తెరలేపారు. దీంతో ప్రచార సమయంలో హంగూ ఆర్భాటం ఉండేలా మనిషికి ఇంత చొప్పున నగదు చెల్లించి పలువురిని వెంట తిప్పుకుంటున్నారు. దీంతో మునిసిపాలిటీల్లో రోజువారీగా పనిచేసుకునే వారికి ఉపాధి లభిస్తోంది. ఉదయం సాయంత్రం వేళ్లలో అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొంటే భోజనాలు పెట్టించి 500రూపాయల వరకు కూలీ ఇచ్చి బిర్యానీ పెడుతుండడంతో పలువురు కూలీలు ప్రచార బాటపడుతున్నారు.
ఫ కళాకారులకు, అద్దె వాహనాలకు డిమాండ్..
ప్రచారంలో భాగంగా డప్పు కళాకారులకు ఆదరణ లభిస్తోంది. డప్పుచప్పుళ్లతో అభ్యర్థులు నాయకులు వాడవాడకు ర్యాలీగా వెళుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల ముఖ్య నాయకుల రాకకు ముందు డప్పుల చప్పుళ్లు తప్పనిసరిగా మారాయి. ఉత్సాహంతో కార్యకర్తలు నృత్యాలు చేస్తున్నారు. 8నుంచి 10మంది ఉన్న కళాకారుల బృందం బరిలో ఉన్న అభ్యర్థుల నుంచి రోజుకు 5వేల నుంచి 8వేల రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే అభ్యర్థుల పేరిట పాటలు రచించి రికార్డు చేయించి ప్రచారంలో వినియోగించుకుంటున్నారు. దీంతో పాటలు పాడి రికార్డు చేసే కళాకారులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సభలో కుర్చీలు వేస్తున్నారు. దీంతో టెంటు హౌజ్ వ్యాపారులకు గిరాకీ పెరిగింది. అలాగే ఆయా కుల సంఘాలు, ప్రజాసంఘాలు, కాలనీవాసులతో సమావేశాలను చిన్నచిన్న ఫంక్షన్ హాళ్లలో నిర్వహిస్తుండడంతో వారికి గిరాకీ పెరిగింది. ఆటోవాలాలకు సైతం గిరాకీ పెరిగింది. ప్రధానంగా ట్రాలీ, ప్యాసింజర్ ఆటోలకు బాగా గిరాకీ పెరిగింది. ట్రాలీఆటోలకు బ్యానర్లు కట్టి మైకులు పెట్టి వాడ వాడలా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం ప్రచారం ముగిసే వరకు వాహనాలను మాట్లాడుకున్నారు. అలాగే పోలింగ్ రోజున బూతుల వద్దకు ఓటర్లను తరలించేందుకుగాను ప్యాసింజర్ ఆటో యజమానులకు అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. సభలకు నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు కూడా ఆటోలను వినియోగిస్తున్నారు. ఇదే అదనుగా వాహనాల యజమానులు అద్దె ధరలను ఒక్కసారిగా పెంచడం విశేషం.
ఫ హోటళ్లు, మద్యం దుకాణాల జోరు..
సభలు, సమావేశాలు ప్రచారానికి వెళ్లే ముందు నాయకులు, కార్యకర్తలు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తప్పనిసరిగా మారింది. దీంతో పట్టణంలో ఉన్న హోటళ్లు ఒక్కసారిగా కిటకిటలాడుతున్నాయి. పలువురు హోటల్ యజమానులకు ఆర్డర్ ఇస్తూ కోరిన చోటుకే వంటలను తీసుకెళ్తున్నారు. అలాగే కొందరు సమావేశాల పేరున హాజరైన వారికి చికెన్, మటన్ బిర్యానీలు ఏర్పాటు చేస్తుండడంతో ఇందుకు ప్రత్యేకంగా వంట మనుషులను మాట్లాడుకున్నారు. దీంతో హోటల్ యజమానులతోపాటు వందల సంఖ్యలో వంట మనుషులకు సైతం ఉపాధి లభిస్తోంది. అలాగే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సభలు, సమావేశాలకు వెళ్లడమే కాకుండా పొద్దంతా ప్రచారంలో పాల్గొంటున్న నాయకులకు, కార్యకర్తలకు రాత్రి సమయంలో మద్యంతోపాటు భోజనం పెట్టించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారం ముగియడానే ఒక్కొక్కరికి 300నుంచి 500రూపాయల వరకు డబ్బులు ఇస్తుండడంతో కార్యకర్తలు, రోజువారీ కూలీలు మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు గంట వ్యవధిలో పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీనికితోడు బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు మద్దతుదారులు పదుల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు, వివిధ వాహనాలు వినియోగించడంతోపాటు పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిల్ కోసం క్యూ కడుతున్నారు. ఇలా మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని ఎన్నో వర్గాల వారికి ఉపాధి లభిస్తోంది.