Share News

ఎన్నికల తనిఖీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:58 AM

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తనిఖీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎన్నికల తనిఖీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్య ప్రసాద్‌

ఫ కలెక్టర్‌ సత్య ప్రసాద్‌

జగిత్యాల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తనిఖీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి ఫ్లయింగ్‌ స్కాడ్‌, ఎస్‌.ఎస్‌.టి, ఎఫ్‌.ఎస్‌.టి, జోనల్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎక్స్పెండిచర్‌ అబ్సర్వర్‌ల తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడారు. జోనల్‌ అధికారులు, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి టీములు తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున రూ.50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు రూ. 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉన్నదన్నారు. రూ. 50 వేలకు పైబడి ఉన్న నగదుకు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, స్పెషల్‌ టీమ్‌ల పాత్ర ఎలా ఉంటుందనే విషయాలపై వివరించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఈ బృందాల పాత్ర కీలకం గా ఉంటుందన్నారు. జోనల్‌ అధికారులకు మేజిస్ట్రేట్‌ పవర్‌ అధికారాలు ఉంటాయన్నారు. ఎటువంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మద్యం, లిక్కర్‌ తదితర వస్తువులు పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సర్వేలెన్స్‌ వీడియో రికార్డ్‌ తప్పనిసరిగా చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీల సమావేశాలు, బ్యానర్లు మొదలైన సామాగ్రి పై వీడియో సర్వేలెన్స్‌ టీమ్‌లు రికార్డు చేయాలని తెలిపారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ టీమ్‌లు సీజ్‌ చేసిన నగదును పోలీసులకు సమర్పించాలని, ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు కాని నగదును డిస్ట్రిక్ట్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు సమర్పించాలని తెలిపారు. గ్రీవెన్స్‌సెల్‌ తగిన ఆధారాలను పరిశీలించి నేరారోపణ లేకపోతే ఆ నగదును సంబంధిత వ్యక్తులకు అందజేస్తారన్నారు. ప్రభుత్వ వాహనాల ను కూడా చెక్‌ చేసే అధికారం ఉన్నదని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా కలెక్టరేట్‌లో 24గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ అందుబాటు లో ఉందని తెలిపారు. అలాగే ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 9866234383ను సంప్రదించాలని సూచించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ బి. రాజ గౌడ్‌, ఎక్స్పెండీచర్‌ అబ్జర్వర్‌ డి. శ్రీని వాస్‌, జిల్లా నోడల్‌ అధికారులు మనోజ్‌ కుమార్‌, వి. భాస్కర్‌, పి. నరేష్‌, రవికుమార్‌, దుర్గపు శ్రీనివాస్‌ గౌడ్‌, జిల్లా ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:58 AM