ఆర్టీసీలో ఎన్నికల జోష్
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:17 AM
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల జోష్ మొదలైంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో డిపోల వద్ద కార్మిక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల జోష్ మొదలైంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో డిపోల వద్ద కార్మిక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ హయాంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘాలను రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సుదీర్ఘకాలం తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ చేపట్టడంతో కార్మికుల్లో ఉత్సాహం మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యూనియన్లు, వ్యూహ, ప్రతి వ్యూహాలపై దృష్టిపెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోలు ఉండగా 425 మంది ఓటు హక్కు కలిగిన కార్మికులు ఉన్నారు. ఇందులో సిరిసిల్లలో 207 మంది, వేములవాడలో 218 మంది ఉన్నారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పారదర్శకంగా ఎన్నికల నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రెండు డిపోల వద్ద మూడు కూటమిలుగా ఏర్పడిన యూనియన్లు ప్రచారం చేస్తుండడంతో సందడిగా మారింది.
సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలు
ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా చివరిసారిగా 2016లో కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ యూనియన్లను రద్దు చేయడంతో కార్మిక సంఘాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. కార్మికులకు అండగా ఉండే యూనియన్ల గొంతు మూగబోయింది. గతంలో విధి నిర్వహణలో ఉద్యోగులు, కార్మికులకు ఇబ్బంది ఎదురైతే సంఘాల నేతలు అండగా ఉండేవారు. తమ సమస్యల పరిష్కారం, హక్కుల కోసం పోరాటాలు చేసేవారు. గత ప్రభుత్వ హయాంలో సంఘాల రద్దు కావడంతో కార్మికులు నిరుత్సాహపడ్డారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించడంతో కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 9 తేదీన ఉదయం 5 గంటల నుంచి, సాయంత్రం 6 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహిస్తారు. 14,15వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. 17వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. సిరిసిల్ల, వేములవాడ డిపోలో పరిధిలోని ఓటర్లు ఆయా సంఘాలకు సంబంధించిన రాష్ట్ర గుర్తింపు కోసం ఒక ఓటు, జిల్లా గుర్తింపు కోసం మరో ఓటును కలిపి రెండు ఓట్లను ప్రతి ఓటరు వేయాల్సి ఉంటుంది. కార్మికులకు ఓటు హక్కు అర్హతగా సెప్టెంబర్ 1,2026 వరకు ప్రామాణికంగా నిర్ణయించారు. ఆ తేదీ నాటికి కనీసం 8 నెలల నిరంతర సర్వీస్ పూర్తిచేసి రెగ్యులర్, క్యాజువల్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ పే, కార్మికులందరికీ ఓటు హక్కు కల్పించారు. అనారోగ్యంతో సెలవుల్లో ఉన్నవారు, సస్పెన్షన్, ఫుట్ ఆఫ్ డ్యూటీలో ఉన్న కార్మికులకు కూడా ఓటు హక్కు కల్పించారు. క్లాస్-2 సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రైవేట్ ఈవీ బస్ డ్రైవర్లు, ప్రైవేట్ టీవీ డ్రైవర్లు, రిటైర్డ్ సిబ్బందికి ఓటు హక్కు కల్పించలేదు. బస్సులపై, ఆర్టీసీ అస్తులపై ఎన్నికల బ్యానర్లు కట్టడంపై పూర్తిగా నిషేధం విధించింది. డిపోలో ప్రాంగణంలో యూనియన్ల సమావేశాలు నిర్వహించకూడదు. పోస్టల్ బ్యాలెట్ ముగిసే వరకు ఉద్యోగుల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఆసక్తికరంగా పోరు
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 12 కార్మిక సంఘాలు ఆర్టీసీ ఎన్నికల బరిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్(ఏ) బలపరిచిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ), స్టాఫ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ), స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఒక కూటమిగా పోటీ చేస్తుండగా, ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) ఒక కూటమిగా బరిలోకి దాగాయి. అలాగే తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ పోటీలో నిలిచింది. ఇందులో ప్రధానంగా రెండు కూటమిల మధ్య ముమ్మరంగా పోరు సాగుతోంది.