Share News

పట్టణాల్లో మొదలైన ఎన్నికల సందడి

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:28 AM

మున్సిపల్‌ ఎన్నికలకు ఈ నెలాఖరులో నగరా మోగనుండడంతో పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలయ్యింది.

 పట్టణాల్లో మొదలైన ఎన్నికల సందడి

- ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

- ఈ నెల 4 వరకు అభ్యంతరాలు

- 10న తుది జాబితా విడుదల

- నెలాఖరులో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం

- రిజర్వేషన్లపై నేతల్లో ఉత్కంఠ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మున్సిపల్‌ ఎన్నికలకు ఈ నెలాఖరులో నగరా మోగనుండడంతో పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలయ్యింది. ఇప్పటికే వార్డులు, డివిజన్ల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాలను సంబంధిత అధికా రులు ప్రదర్శించారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 4వ తేదీ కల్లా అందజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి మున్సిపాలిటీల వారీగా ఓటర్ల తుది జాబితాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్లను ఖరారు చేసిన అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా రొటేషన్‌ ప్రకారం ఖరారు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పోటీకి సన్నద్ధం అవుతు న్నారు. వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలు వెలువడడంతో ఆయా వార్డులు, డివిజన్లలో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ పదవులకు పోటీ చేసే అభ్యర్థులతోపాటు చైర్మన్‌ పదవులపై కన్నేసిన నేతలు ఓటర్ల జాబితాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలో తప్పొప్పులను గుర్తించడం, అలాగే అడ్రస్‌ మార్పు, తదితర సవరణలపై దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా కౌన్సిలర్‌ పదవులపై కన్నేసిన ఆశావహులంతా జాబితాల పరిశీలిస్తున్నారు కాగా అధికారులు సైతం మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథనిలో మున్సిపాలిటీ ఉండగా, రామగుండంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉంది. వీటిలో మొత్తం 124 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. మంథని మున్సిపాలిటీలోని 13 వార్డుల్లో 14,414 మంది ఓటర్లు, పెద్దపల్లి మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో 43,845 మంది ఓటర్లు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో మంది ఓటర్లు ఉన్నారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 1,82,976 మంది ఓటర్లు ఉన్నారు.

ఫ సన్నద్ధమవుతున్న పార్టీలు..

మున్సిపల్‌ ఎన్నికలకు ఈ నెలాఖరులో నగారా మోగనుండడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ సహ బీఆర్‌ఎస్‌, బీజేపీ, తదితర పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్‌ సహ, మూడు మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకొంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంథని, సుల్తానాబాద్‌ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి హస్తగతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీల్లోనూ పాగా వేయాలని తహతహలాడుతున్నది. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ సన్నద్ధం అవుతున్నాయి. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగనుండడంతో ఆశావహులు టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే ఆయా పార్టీల నేతల చుట్టూ తిరుగుతున్నారు.

ఫ రిజర్వేషన్లపై ఉత్కంఠ..

మున్సిపాలిటీల్లో వార్డులు, చైర్మన్‌ పదవులు, కార్పొరేషన్‌లో మేయర్‌, కార్పొరేటర్‌ పదవులు ఏ వర్గానికి రిజర్వు అవుతాయనే ఉత్కంఠ నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో తీసుక వచ్చిన మున్సిపల్‌ చట్టంలో పదేళ్ల వరకు ఒకటే రిజర్వేషన్‌ అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చట్ట సవరణ చేసి ప్రతి ఐదేళ్లకోసారి రోటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు మారను న్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు, మిగిలినవి బీసీలకు కేటాయించనున్నారు. దీంతో ఆయా వార్డులు, డివిజన్లకు చెందిన వివిధ పార్టీల నాయకులు గత ఎన్నికల్లో ఆ స్థానం ఏ వర్గానికి రిజర్వు అయ్యింది, ఈసారి ఏ వర్గానికి రిజర్వు అవుతుందనే అంచనాల్లో మునిగి తేలుతున్నారు. తాము నివసిస్తున్న వార్డులో రిజర్వేషన్‌ అనుకూలంగా రాకుంటే ప్రత్యామ్నాయంగా మరొక వార్డు చూసుకుంటున్నారు. మొత్తం మీద పట్టణాల్లో ఎన్నికల వేడి మొదలయ్యింది.

Updated Date - Jan 04 , 2026 | 01:28 AM