వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు..
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:57 AM
ఆధ్యాత్మిక శోభను నింపిన వినాయక నవరాత్రి ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఆధ్యాత్మిక శోభను నింపిన వినాయక నవరాత్రి ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. విఘ్నాలను తొలగించే గణనాథుడు నవరాత్రి ఉత్సవాలను ముగించుకొని భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడిలోకి చేరుకోవడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని పలుచోట్ల నిమజ్జనం కార్యక్రమాలు మొదలుకాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు మరికొన్ని మండలాల్లో శుక్రవారం ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించుకునేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వినాయక నిమజ్జనం ప్రశాంత నిర్వహణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. దీంతోపాటు మద్యం అమ్మకాలపై 24 గంటల పాటు నిషేధ ఆంక్షలు విధించారు. సిరిసిల్ల మానేరు మానేరు వాగు వద్ద జిల్లా యంత్రాంగంతో పాటు మున్సిపల్ కౌన్సిల్ నిమజ్జనం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జిల్లాలో చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు ప్రతిష్టించారు. నిమజ్జనం వేళ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు నిండుకుండలా ఉన్నాయి. నిమజ్జనం కోసం చెరువులు, వాగుల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేశారు. నిమజ్జనానికి వచ్చే యువజన సంఘాలు, కుల సంఘాలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. జిల్లాలు మున్సిపాలిటీ, అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి నిమజ్జనోత్సవానికి ఎలాంటి అవరోధాలు లేకుండా సిద్ధమయ్యారు. శుక్రవారం సిరిసిల్ల మానేరు బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతే పరిశీలించారు. అధికారులకు, పోలీసులకు సూచనలు చేశారు.
ఉత్సవాలకు రూ.20 కోట్లపైన ఖర్చు
సిరిసిల్ల మానేరు వాగులో ప్రత్యేక పాండ్‌లను క్రేన్‌లను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి ఉత్సవాలకు దాదాపు రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అంచనాలు వేశారు. మండపాల వద్ద నిత్య అన్నదానాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భారీ సెట్టింగ్‌లు వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దాదాపు ఒక్కొక్క విగ్రహం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేసి భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో చిన్నచిన్న విగ్రహాలకు కొదవ లేదు. భారీ విగ్రహాలే జిల్లా కేంద్రంలో 600 వరకు ఉండగా మండలాలు, గ్రామాల్లో 5 వేలకు పైగానే ఉన్నాయి. చిన్నచిన్న విగ్రహాలు, మండపాలకు కొదవ లేదు. ఏ గ్రామానికి వెళ్లినా ఏ రోడ్డువైపు వెళ్లినా వినాయక విగ్రహాలు దర్శనమిచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నారు. సిరిసిల్ల మానేరు వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేశారు. మండలాలు, గ్రామాల్లో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లలో భాగస్వాములు అయ్యారు.
నిమజ్జనం వేళ జాగ్రత్తలు పాటించండి..
వినాయకుల నిమజ్జనానికి తరలివెళ్లే భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. నిమజ్జనం వెళ్లే సమయంలో వాహనాలను ఓవర్‌టేక్ చేయవద్దని, రోడ్ల పక్కన నిలపవద్దని సూచనలు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని సూచనలు చేశారు. పిల్లలు, మహిళలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలకు దూరంగా ఉండడం మంచిదన్నారు. నిమజ్జనానికి వెళ్లే వారు ఇంటివద్దనే ఆహారం తిని వెళ్లడం మంచిదని, రోడ్డు పక్కనే తినే ఆహారం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ముందస్తుగానే నిమజ్జనాలు..
జిల్లాలో వేములవాడలో బుధవారం నిమజ్జనం జరగగా, వివిధ వాణిజ్య సంస్థలు, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచే కొనసాగాయి. ప్రత్యేక అలంకరణలతో పాఠశాల విద్యార్థులు ఎంతో అనందంగా కోలాటం అడుతూ మానేరు వాగులో నిమజ్జనాలు చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు మండపాల వద్ద దాండియా, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేశాయి.