Share News

హనుమాన్‌ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - May 11 , 2026 | 12:10 AM

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆలయ ఉద్యోగులకు ఈవో రమాదేవి ఆదేశించారు.

హనుమాన్‌ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు

వేములవాడ, మే 10 (ఆంధ్రజ్యోతి): హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆలయ ఉద్యోగులకు ఈవో రమాదేవి ఆదేశించారు. భీమేశ్వర సదన్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఆలయ ఉద్యోగులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదిన పెద్ద హనుమాన్‌ జయంతి వేడుకలు ఉండటంతో ఆలయానికి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్‌లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణం, పార్కింగ్‌ ప్రాంతాల్లో పారిశుభ్రతను మెరుగుపరచాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌ సేవలు మరింత మెరుగుపరచాలని సూచించారు. కొండగట్టుకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడకు వచ్చి శ్రీస్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులతో మర్యాద పూర్వకంగా మెదలాలని, భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకుని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ, ఈఈ, ఏఈవోలు, సూపరిండెంట్‌లు, ఆలయ అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 12:10 AM