వరికి ఎల్నినో గండం
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:55 AM
ఎల్నినో కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మండుతున్న ఎండలు, తగ్గిన భూగర్భ జలాలతో వానా కాలం వరి పంట చేతికివచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఎల్నినో కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మండుతున్న ఎండలు, తగ్గిన భూగర్భ జలాలతో వానా కాలం వరి పంట చేతికివచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మరో 15 రోజుల నుంచి నెలరోజుల్లో రెండు లేక మూడు తడులు నీరందితే తప్ప వరి పొలాలు ఆశించిన దిగుబడి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఫ ఎస్సారెస్పీ నీరు వదిలినా..
శ్రీరాంసాగర్ ఆయకట్టుకు ప్రభుత్వం కాకతీయ కాలువ ద్వారా 6,500 క్యూసెక్కుల నీరు వదులుతున్నా ప్రాజెక్టు నుంచి జగిత్యాల జిల్లా దాటే వరకు ఉన్న పొలాలకే ఆ నీరు అందుతున్నది. జిల్లాలోని రేవెల్లి హెడ్ రెగ్యులేటర్ను దాటి రెండు వేల క్యూసెక్కుల నీరు కూడా రాని కారణంగా కాకతీయ కాలువ, డీ-83, 86, డీ-90 వరకు ఉన్న ఆయకట్టుకు నీరంద ని పరిస్థితి ఉత్పన్నమైంది. ఎగువన ఉన్నవారు నీరు ఎక్కువగా వినియోగించుకోవడం, కాకతీయ కాలువకు అక్రమంగా మోటార్లు పెట్టి నీరుతోడడంతో దిగువకు నీరు రావడం లేదు. దీనితో జగిత్యాల జిల్లా దాటిన తర్వాత చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల ఆయకట్టు రైతులు పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో నీరు వదలాలని ఆందోళనలకు దిగుతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లి డీ-84 నుంచి 94 వరకు ఉన్న ఆయకట్టుకు నీటిని వదలాలని ఆందోళన చేయడం పరిస్థితికి అద్దంపడుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఇటీవలే 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. ఎగువన ఉన్న జగిత్యాల జిల్లా ఆయకట్టుకు 3,500 క్యూసెక్కుల నీటిని వినియోగించుకున్నా దిగువకు కనీసం 3,000 క్యూసెక్కుల నీరు రావలసి ఉంటుంది. చొప్పదండి నియోజకవర్గంలోని రేవెళ్ల హెడ్ రెగ్యులేటర్ వరకు 3,000 క్యూసెక్కుల నీరు వస్తేనే అక్కడ నుంచి డీ-83,86 కాకతీయ కాలువ డీ-90 వరకు ఉన్న పిల్ల కాలువల కింద ఉన్న 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఎగువన ఉన్న రైతులు నీటిని విచ్చలవిడిగా వినియోగించుకుంటున్న కారణంగా 1,050 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్నది. దీంతో అధికారులు ఆ నీటినే డీ-83, డీ-86 కాకతీయ కాలువలకు సర్దుబాటుచేస్తున్నారు. డీ-83 కాలువ కింద 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. డీ-86 కింద 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. వీటికి సాగునీరందాలంటే కనీసం రెండు వేల క్యూసెక్కుల నీరు అవసరం. ప్రస్తుతం ఈ రెండు కాలువలకు 400 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాలకు చెందిన 25వేల ఎకరాల ఆయకట్టుకు కనిష్ఠంగా 300 క్యూసెక్కుల నీరైనా విడుదల చేయాల్సి ఉన్నది. 1050 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుండడంతో అటు కరీంనగర్, చొప్పదండి, నియోజకవర్గాల ఆయకట్టుతోపాటు పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల ఆయకట్టుకు కూడా నీరు అందని పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో వరి పొలాలు ఎండిపోయే పరిస్థితులు నెలకొననున్నాయి.
ఫ ఎల్లంపల్లి నుంచి నీటిని వదిలితేనే..
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని పంపింగ్ చేసి వరద కాలువ ద్వారా కాకతీయ కాలువకు రెండు వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తే వరిపొలాలను కాపాడే అవకాశమున్నది. ఎల్లంపల్లి నుంచి వరద కాలువలో వదిలిన నీరు మల్యాల మండలం తాటిపల్లి వద్ద కాకతీయ కాలువలోకి వస్తాయి. అక్కడ నుంచి రేవెళ్ల హెడ్ రెగ్యులేటర్కు నీరు చేరుకొని డీ-83, డీ-86 కాలువలకు కరీంనగర్ జిల్లా పరిధిలోని డీ-84 నుంచి 94 వరకు ఉన్న కాలువలకు నీటి సరఫరా మెరుగుపడి వరి పొలాలు ఎండిపోకుండా ఆశించిన దిగుబడిని ఇచ్చే అవకాశమున్నది. జిల్లా యంత్రాంగం వెంటనే నీటి విడుదలకు చర్యలు తీసుకుంటే కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పంటలను కాపాడవచ్చు. అధికారులు ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.