ఎల్‌నినో వి‘పత్తి’
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:12 AM
తెల్ల బంగారంగా భావిస్తూ ప్రతి ఏటా రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నా ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను చూస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు లేక పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. బహిరంగ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోళ్లకు సిద్ధమైనా రైతులు వచ్చిన దిగుబడిని బహిరంగ మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు.
- తెల్ల బంగారంపై దిగుబడి దిగాలు
- ధర కలిసొచ్చినా రైతులకు నిరాశే..
- కూలీల కొరతతో తప్పని ఇబ్బందులు
- జిల్లాలో 50,275 ఎకరాల్లో పత్తి సాగు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తెల్ల బంగారంగా భావిస్తూ ప్రతి ఏటా రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నా ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను చూస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు లేక పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. బహిరంగ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోళ్లకు సిద్ధమైనా రైతులు వచ్చిన దిగుబడిని బహిరంగ మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్ మద్దతు ధర రూ.8667 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు రైతుల వద్ద నుంచి నేరుగా క్వింటాలకు 9వేల నుంచి రూ.9500 వరకు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు నేరుగా అమ్ముకోవడానికి సిద్ధమైన పత్తి దిగుబడి లేక దిగాలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.23 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తే అందులో వరి తర్వాత ప్రధాన పంటగా 50,275 ఎకరాలు పత్తి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో పత్తి సాగులో ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు ఆందోళన ఏర్పడింది. మార్కెట్లో పత్తి ధర రోజురోజుకు పెరుగుతుండడంతో పంట దిగుబడి తక్కువ ఉండడంతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. పత్తి సాగుకు పెట్టుబడి, ఎరువులు, పురుగుల మందు, కూలీల ఖర్చు భారంగా మారిందని, ధర అనుకూలంగా ఉన్న దిగుబడితో ఆశించిన ఆదాయం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐదు జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రాల్లో సిద్ధం చేసిన రైతులు మాత్రం నేరుగా అమ్ముకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఎకరానికి 7 క్వింటాళ్ల లోపే దిగుబడి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో ఎన్నో ఆశలతో రైతులు 50,275 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇందులో గంభీరావుపేటలో 120 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12,750 ఎకరాలు, ముస్తాబాద్‌లో 1,050 ఎకరాలు, సిరిసిల్లలో 700 ఎకరాలు, తంగళ్లపల్లిలో 1,400 ఎకరాలు, వీర్నపల్లిలో 450ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3,300 ఎకరాలు, బోయినపల్లిలో 720ఎకరాలు, చందుర్తిలో 6,500 ఎకరాలు, కోనరావుపేట 5,100 ఎకరాలు, రుద్రంగిలో 2,230 ఎకరాలు, వేములవాడలో 5,200 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4,300 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో పత్తి మొక్క ఎదుగుదలతో దిగుబడిపై ప్రభావం చూపుతోంది. కొన్ని చోట్ల పంట పూర్తిగా చేతికందని పరిస్థితులు ఉన్నాయి. ఎకరానికి 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. పత్తికి ధర రైతులను ఆకర్షిస్తున్న దిగుబడి మాత్రం డీలాపరుస్తోంది.