Share News

పారదర్శకతకు ఈ-కేవైసీ..

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:07 AM

మహిళలకు ఆర్థిక ఎదుగుదలకు వారధిగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రూపుల ఖాతాలకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది.

పారదర్శకతకు ఈ-కేవైసీ..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

మహిళలకు ఆర్థిక ఎదుగుదలకు వారధిగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రూపుల ఖాతాలకు ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది. మహిళా సంఘాలకు పారదర్శకంగా లబ్ధి చేకూరే లక్ష్యంగా ఈ-కేవైసీ- ఆధార్‌ ఫొటో అథెంటికేషన్‌ అనుసంధానం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. లోకస్‌ యాప్‌లో ఫొటో అథెంటికేషన్‌ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం జిల్లాలో ఈ-కేవైసీ ఆధార్‌ 27.34 శాతం పూర్తి చేశారు. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 9963 సంఘాల్లో ఉన్న సభ్యుల ధ్రువీకరణతో ఒకే సభ్యురాలు ఒకే సంఘంలో ఉండే విధంగా ఉపయోడుతుంది. బ్యాంకు ఖాతాలకు ఈ -కేవైసీ ద్వారా ఒకరి పేరు మీద వచ్చిన డబ్బులు మరొకరు డ్రా చేయకుండా, గ్రూపు పేరిట నకిలీ ఖాతాలు తెరవడం వంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావించింది. బ్యాంకు రుణాల లింకేజీ కూడా సులభతరం కానుంది. ఆధునిక బ్యాంకింగ్‌ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కల్పించే రుణబీమా, ప్రమాద బీమా పథకాలు వర్తించాలంటే సభ్యుల వయస్సును ఆధార్‌ ఆధారంగా చూస్తారు. దీనికి ఈ-కేవైసీ అత్యంత కీలకంగా ఉంటుంది. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా నిర్వహించే వ్యాపారాలకు, డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల కోసం ఈ-కేవైసీ అవసరం అవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ-కేవైసీ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సమాచారాన్ని లోకోస్‌ యాప్‌లో పొందుపరిచారు. సంఘాల ఆర్థిక ప్రగతి, రుణాలు, వాయిదాల చెల్లింపులు, వ్యాపారాలు లాభనష్టాల ఎప్పటికప్పుడు తెలియడం లేదు. దీంతో లోకోస్‌ యాప్‌లో నమోదైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరితో ఈ-కేవైసీ చేసే పనిలో సెర్ప్‌ సిబ్బంది నిమగ్నమయ్యారు.

జిల్లాలో ఈ-కేవైసీ ఆధార్‌ 27.34 శాతం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9963 స్వశక్తి సంఘాలు, 411 గ్రామ సంఘాలు, 12 మండల సంఘాలు, వీటికి అనుసంధానం చేస్లూ జిల్లా సమాఖ్య కూడా పనిచేస్తుంది. స్వశక్తి సంఘాల పరిధిలో 93808 మంది సభ్యులు ఉన్నారు. లోకోస్‌ యాప్‌లో సభ్యుల పేర్లు నమోదు కాగా ఈ సభ్యులందరితో లోకోస్‌ యాప్‌లో ఫొటో అథెంటికేషన్‌ చేయాల్సి ఉంది. ఈనెల 31 వరకు ఈ-కేవైసీ ఆధార్‌కు గడువుండగా ఇప్పటివరకు జిల్లాలో 27.34 శాతం పూర్తిచేశారు. 25645 సభ్యుల ఫొటో అథెంటికేషన్‌ పూర్తి చేశారు. సభ్యుల 90214 బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ పూర్తికాగా 96.17 శాతం ఉంది. మొబైల్‌ అనుసంధానం 922764 మంది సభ్యుల్లో 77067 సభ్యులు 83.08 శాతం వెరిఫికేషన్‌ చేశారు. ఫొటో అథెంటికేషన్‌ మాత్రం 27.34శాతం జరిగింది. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో కూడా ఈ-కేవైసీ చేయాల్సి ఉంది. ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఫొటో అథెంటికేషన్‌ చేసే సమయంలో ఆధార్‌లో ఉన్న ఫొటో ప్రస్తుతం సభ్యురాలు ఒకే విధంగా ఉంటే ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా పొదుపు సంఘాల సభ్యులకు చేరే విధంగా ఈ-కేవైసీ ఆధార్‌ ఫొటో అథెంటికేషన్‌ తప్పనిసరి చేసినట్లుగా తెలుస్తోంది. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్‌ ద్వారా మహిళా అభ్యున్నతికి నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపు నేరుగా పొదుపు సంఘాల ఖాతాల్లోకి పంపిణీ చేసే విధంగా ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి.

మూడు విడతల్లో కొత్త వడ్డీ రూ.39.75 కోట్లు చెల్లింపు

మహిళలు స్వశక్తిగా ఎదగడానికి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక దృష్టి సారించినా గత ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ కోసం స్వశక్తి సంఘాల మహిళలకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో గత ప్రభుత్వంలో రూ.68.66 పెండింగ్‌ బకాయిలు ఉన్నాయి. వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు జిల్లాని స్వశక్తి సంఘాల మహిళలకు మహిళా శక్తి ద్వారా మూడు విడతలుగా రూ.39.75 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7802 సంఘాలకు రూ 7.39 కోట్లు, 2024-25 సంవత్సరంలో 8552 సంఘాలకు రూ 16 కోట్లు, 2025-2026 సంవత్సరంలో 8371 సంఘాలకు రూ 16.35 కోట్లు మహిళకు వడ్డీ రాయితీ అందించారు.

జిల్లాలో ఈ-కేవైసీ ఆధార్‌ వివరాలు

మండలం సభ్యులు ఈ-కేవైసీ పూర్తయిన సభ్యులు శాతం

వేములవాడ 3207 2160 67.35

రుద్రంగి 3687 2235 60.62

గంభీరావుపేట 10719 3336 31.12

ఇల్లంతకుంట 10396 3199 30.77

తంగళ్ళపల్లి 10352 2775 26.81

చందుర్తి 7412 1985 26.78

బోయిన్‌పల్లి 7588 2027 26.71

వీర్నపల్లి 3426 887 25.89

వేములవాడ రూరల్‌ 4889 1264 25.85

ఎల్లారెడ్డిపేట్‌ 10585 2471 23.34

ముస్తాబాద్‌ 11040 1827 16.55

కోనరావుపేట్‌ 10507 1479 14.08

మొత్తం 93808 25645 27.34

Updated Date - Aug 24 , 2026 | 01:07 AM