Share News

ప్రవేశాల పెంపునకు కసరత్తు

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:04 AM

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడానికి అధ్యాపకులు కసరత్తు చేస్తున్నారు.

ప్రవేశాల పెంపునకు కసరత్తు

జగిత్యాల, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడానికి అధ్యాపకులు కసరత్తు చేస్తున్నారు. జూనియర్‌ లెక్చరర్లు పల్లె బాట పట్టారు. జూనియర్‌ కళాశాలల్లో వసతులపై అవగాహన కల్పిస్తూ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ఇంటర్‌ కళాశాలల్లో వసతులు, లెక్చరర్లు ఉన్నారని పేర్కొంటు న్నారు. ఉన్నతమైన ఫలితాలు సాధించవచ్చని తల్లిదండ్రుల్లో ధీమా కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌తో ఇంటర్‌లో ప్రవేశాలు పెరుగుతాయని విద్యాశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఫజిల్లాలో ఇంటర్‌ విద్యా పరిస్థితి ఇలా..

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతో పాటు కస్తూర్బా, ఇతర గురుకుల జూనియర్‌ కళాశాలలు 47 వరకు ఉన్నాయి. ఇందులో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 13 మోడల్‌ కళాశాలలు, 5 మైనార్టీ జూనియర్‌ కళాశాలలు, 12 కస్తూర్బా జూనియర్‌ కళాశాలలు, ఐదు మహాత్మ జ్యోతిరావుఫూలే జూనియర్‌ కళాశాలు, రెండు గురుకుల జూనియర్‌ కళాశాలలు, ఐదు సంక్షేమ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సుమారు 3 వేల మంది ప్రథమ సంవత్సర విద్యార్థులు, 3,335మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు అభ్యసిస్తున్నారు. రెండు వేల వరకు రెసిడెన్షియల్‌, మైనార్టీ, బీసీ తదితర జూనియర్‌ కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫప్రభుత్వ అనుబంధ రంగాల నుంచే పోటీ అధికం..

గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు అంటున్నారు. ప్రభుత్వ అనుబంద యాజమాన్యాల పరిదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు ఆదర్శ కళాశాలలు, కేజీబీవీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గ్రామీణ విద్యార్థులు వసతి గృహం ఉన్న కళాశాలల్లో చేరేందుకు ఇష్ట పడుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రిన్సిపాల్స్‌ నేతృత్వంలో లెక్చరర్లు ఇంటింటికీ వెళ్లి ప్రవేశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఫకళాశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్లు..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్‌ కళాశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి జూన్‌ తొలి వారం నుంచి ప్రారంభించాలని ఇంటర్‌ విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. ప్రథమ సంవత్సరం ప్రవేశాలను ముమ్మరంగా జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామీణ జిల్లా జగిత్యాలలో ప్రవేశాలు కల్పించేందుకు సంబంధిత ప్రిన్సిపాల్స్‌ సన్నద్ధం అవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.

ఫవసతులపై విస్తృతంగా ప్రచారం..

జిల్లాలోని పల్లెలు, పట్టణాలల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అధికశాతం పిల్లలను చేర్పించేందుకు ప్రవేశాలు పెంచేందుకు ప్రిన్సిపల్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా కొందరు లెక్చరర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కళాశాలల్లో లభించే సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ యేడాది కొత్తగా ఏసీఈ కోర్సును అందిస్తున్నారు. వీటితో పాటు పలు కళాశాలల్లో ఉర్దూ మీడియం కోర్సులున్నాయి. అదేవిదంగా పలు ఒకేషనల్‌ కోర్సులను సైతం అందుబాటులో ఉంచారు. కళాశాలల్లో ఉన్న మౌళిక వసతులు, ఇతర సదుపాయాలను వివరిస్తూ ప్రవేశాలు పొందేలా ప్రోత్సహిస్తున్నారు.

ఫకార్పొరేట్‌కు దీటుగా ప్రయత్నాలు..

పేద విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించేందుకు, కార్పొరేట్‌కు దీటుగా విద్యను అందించేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఉచిత పాఠ్య పుస్తకాలు, ఫీజు లేకుండా ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అనుభవజ్లులైన అధ్యాపకుల చేత విద్యాబోధన, పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవడంతో పాటు వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వంటి అంశాలను లెక్చరర్లు సవివరంగా తెలుపుతున్నారు. అంతేకాదు, ఎంసెట్‌, ఐఐటీ, నీట్‌ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతుల గురించి కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వివిధ ఆర్థిక కుటుంబ కారణాలతో పదో తరగతి వరకే కొంతమంది ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. అలాంటి వారి తల్లిదండ్రులకు తమ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జూనియర్‌ లెక్చరర్ల కాంపెయినింగ్‌ జోరుగా జరుగుతోంది.

ప్రవేశాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం

-తిరుపతి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గెజిటెడ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌- 711, జగిత్యాల

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. పట్టణాలు, పల్లెల్లో పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ప్రభుత్వ కళాశాలల్లో జరుగుతున్న బోధన, సమర్థవంతమైన అధ్యాపకులు, వసతులు, పరీక్షలు, ఫలితాలు ఇలా అన్ని అంశాలు వివరిస్తూ విద్యార్థులు కళాశాలలో చేరే విదంగా ప్రయత్నిస్తున్నాము.

ప్రభుత్వ కళాశాలల్లో చేరాలి

-నారాయణ, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని సౌకర్యాలతో కూడిన విద్యా బోధన కల్పిస్తున్నాం. ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేరకు ప్రవేశాలు, తరగతుల నిర్వహణ తదితర చర్యలు తీసుకుంటున్నాము.

Updated Date - Jun 12 , 2026 | 01:04 AM