జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:22 AM
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక కృషి జరుగుతోందని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
- మహాలక్ష్మి పథకం ద్వారా అతివలకు లబ్ధి
-45,867 కొత్త రేషన్ కార్డులు మంజూరు
-మహిళా సంఘాలకు రూ.659.57 కోట్ల రుణాలు
-గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక కృషి జరుగుతోందని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. తెలంగాణ రైజింగ్- 2047 ప్రణాళిక కాదని.. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమని...ప్రత్యేక విజన్‌తోనే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 77వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. పోలీస్ ఫ్లాగ్ మార్చ్‌ను తిలకించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రశంసాపత్రాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వందన సమర్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు రూ.659.57 కోట్ల వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించామని, స్రీనిధి సంస్థ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోరూ. 60 కోట్ల రుణాలను మహిళలకు అందించామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 6.81 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.89 లక్షల గ్యాస్ సిలెండర్లను రూ. 500కు సరఫరా చేశామని వెల్లడించారు.
ఫ గృహజ్యోతితో 2.09 లక్షల మందికి లబ్ధి
గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో 2.09 లక్షల సర్వీసులకు గాను రూ.155.09 కోట్ల నిధులను ప్రభుత్వం చెల్లించిందన్నారు. జిల్లాలో బ్యాంకు లింకేజీ ద్వారా 682 సంఘాలకు రూ.45.54 కోట్ల రుణాలను మంజూరు చేశామన్నారు. జిల్లాలో 69 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.8.28 కోట్లు మంజూరు చేశామన్నారు. దివ్యాంగులకు ఉచిత పరికరాలను అందించామని వివరించారు. జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 25 ఎకరాల భూమిని కేటాయించామని తెలిపారు. జిల్లాలో రూ.400కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించుటకు 186 ఉన్నత పాఠశాలలు ఎంపిక చేసి రూ.14.75 లక్షల కేటాయించామని వెల్లడించారు.
ఫ 11,079 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
జిల్లా వ్యాప్తంగా 11,079 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇందులో ఇప్పటికే 6,392 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా లబ్ధిదారులకు రూ. 134.24 కోట్లను విడుదల చేశామన్నారు. రైతు భరోసా కింద 2025 వానాకాలం సీజన్‌కు 2,25,406 మంది రైతులకు రూ.243.75 కోట్లు ఖాతాలో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. రైతు బీమా కింద 5,215 రైతు కుటుంబాలకు రూ.260.75 కోట్లు అందించామని వెల్లడించారు. రుణమాఫీ కింద నాలుగు విడతల్లో 80,915 మంది రైతులకు రూ.721.74 కోట్లు మాఫీ చేశామన్నారు. 2025-26 వానాకాలం సీజన్‌లో 10,294 మంది రైతుల వద్ద నుంచి 50,029 మెట్రిక్ టన్ను సన్నధాన్యం కొనుగోలు చేసి రూ.119.25 కోట్లు బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
ఫమెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.235 కోట్లు మంజూరు
జిల్లాలో 45,867 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.235 కోట్లు మంజూరు కాగా ఇటీవల పనులు ప్రారంభించామన్నారు. రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్, రూ.3.60 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ భవనాలను ప్రారంభించామని తెలిపారు. భూ భారతి కింద 25,672 మంది రైతుల దరఖాస్తులకు పరిష్కరించామని, జిల్లాలో 514 ఎకరాల్లో పామాయిల్ మొక్కల పెంపకం జరుగుతోందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు ఇటీవల రూ.2.21 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన కృషి చేస్తున్నామని, ఇందుకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి హృదయ పూర్వక వందనం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్, జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.