Share News

అంతర్జాతీయ ప్రమాణాలతో పేదలకు విద్య

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:01 AM

అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు విద్య అందించడమే కాంగ్రెస్‌ ధ్యేయం అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో పేదలకు విద్య
యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

తిమ్మాపూర్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు విద్య అందించడమే కాంగ్రెస్‌ ధ్యేయం అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అనుబంధ గ్రామం యాదవులపల్లిలో 200కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలను ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తుందన్నారు. దానిలో భాగంగానే మొదటి విడతలో మానకొండూర్‌ నియోజకవర్గానికి మంజూరైందన్నారు. ఈ పాఠశాల నిర్మాణం రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందులో 3వేల మంది అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు 4వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్య అందుతుందన్నారు.

ఫ రైతులకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల పంపిణీ

వ్యవసాయశాఖ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మానకొండూర్‌, శంకరపట్నం, తిమ్మాపూర్‌, గన్నేరువరం మండలాలకు చెందిన 36 మంది రైతులకు 33.35లక్షల రూపాయల రాయితీతో వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రైతులకు అందజేశారు. అనంతరం మాన కొండూర్‌ మండలం ఊటూర్‌ చేనేత పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 32 మంది చేనేత కార్మికులకు 20,19,500రూపాయల రుణమాఫీ పత్రాలను అందజేశారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, తిమ్మాపూర్‌ సర్పంచ్‌ గంకిడి లక్ష్మారెడ్డి, ఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ ఏ.అశోక్‌కుమార్‌, జిల్లా వ్యసా య అధికారి భాగ్యలక్ష్మి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:01 AM