Share News

ఈడీ.. పీడీ.. ఆర్‌ఆర్‌ యాక్ట్‌.. లైట్‌ తీస్కో..

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:24 AM

ఈడీ.. పీడీ.. ఆర్‌ఆర్‌ యాక్ట్‌.. ఏదైనా సరే లైట్‌ తీస్కో.. అన్న చందంగా ఉంది జిల్లాలోని కొందరు మిల్లర్ల తీరు..

ఈడీ.. పీడీ.. ఆర్‌ఆర్‌ యాక్ట్‌.. లైట్‌ తీస్కో..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఈడీ.. పీడీ.. ఆర్‌ఆర్‌ యాక్ట్‌.. ఏదైనా సరే లైట్‌ తీస్కో.. అన్న చందంగా ఉంది జిల్లాలోని కొందరు మిల్లర్ల తీరు.. సీఎంఆర్‌ రికవరీకి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అన్నదాతలు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించి తిరిగి బియ్యంగా పేదలకు పంపిణీ చేస్తుంది. ఖరీఫ్‌, యాసంగి సీజన్లలో మిల్లులకు అప్పగిస్తున్న ధాన్యం పక్కదారి పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొందరు మిల్లర్లు సర్కారు సొమ్ముతో ఇతర వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రైస్‌మిల్లర్ల నుంచి కస్టమ్‌ బిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కింద రావాల్సిన బకాయిలను రాబట్టడానికి ప్రభుత్వం సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్నా మిల్లర్ల నుంచి నామమాత్రంగానే స్పందన ఉంది. దీంతో కేసులు నమోదు చేయడం, రెవెన్యూ రికవరీ యాక్ట్‌ (ఆర్‌ఆర్‌ యాక్ట్‌), ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌(పీడీ) కేసులు నమోదుతో బకాయిలు రాబట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిల్లర్లు లెక్క చేయకపోవడంతో చివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌(ఈడీ)కి వద్దకు బకాయిల సమస్య చేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలో మిల్లర్లపై దృష్టి పెట్టింది. అయినా మిల్లర్లు బకాయిలు చెల్లించకుండా కోర్టుల ద్వారా స్టే తెచ్చుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, కేసులో బెదిరింపులను రాజన్న సిరిసిల్ల జిల్లా మిల్లర్లు లైట్‌ తీస్కో అన్నట్లుగాన్లే వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రియల్‌, వడ్డీ వ్యాపారాలతో పాటు పెట్రోల్‌ బంకులు, ఇతర వ్యాపార సంస్థలు నడిపిస్తున్న తీరు కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేసిన ప్రతిసారి మిల్లులో ధాన్యం తేడాలు బయటపడుతున్నాయి. గత నెలలో జిల్లాలో విజిలెన్స్‌ తనిఖీలు చేపడితే మూడు మిల్లులో భారీగా తేడాలు బయటపడ్డాయి. వీరికి నోటీసులు జారీచేసి కేసులు నమోదు చేస్తున్నారు. వందల లారీలు ధాన్యం దించుకొని కేవలం నామమాత్రంగా బియ్యం అప్పగించినట్లుగా బయటపడింది.

రావాల్సిన టెండర్‌ ధాన్యం బకాయి రూ.86.46 కోట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2020 సంవత్సరం నుంచి డిఫాల్ట్‌ మిల్లర్ల నుంచి టెండర్‌ ధాన్యంలో రూ.86.46 కోట్లకు పైగా బకాయిలు పౌరసరఫరాల శాఖకు రావాల్సి ఉంది. కేసులు, నోటీసుల కారణంగా కొంతమేరకు డబ్బులు చెల్లించారు. ప్రస్తుతం జిల్లాలో రూ.67.39 కోట్ల వరకు మిల్లుల నుంచి బకాయిలు రావాల్సి ఉంది. రూ.19.92 కోట్ల వరకు ఇటీవల చెల్లించారు. జిల్లాలో ఒక్కో మిల్లు రూ.4 కోట్ల నుంచి బకాయిలు ఉన్నాయి. మిల్లర్లు బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యం. పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఉన్న లేవీ పద్ధతిని రద్దుచేసి సీఎంఆర్‌ వ్యవస్థను తెచ్చిన తర్వాత ప్రభుత్వం అందిస్తున్న ధాన్యంతో రైస్‌మిల్లర్లు ఇతర వ్యాపారాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం వాటిని వెంటనే విక్రయించి సొమ్ము చేసుకోవడం, బ్యాంకుల నుంచి ధాన్యం తనఖా చూపించి రుణాలు తీసుకోవడం, రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ ద్వారా సీఎంఆర్‌ అప్పగించడం వంటి చర్యలకు మిల్లర్లు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీల నుంచి విజిలెన్స్‌ తనిఖీల వరకు నిఘా పెంచడంతోపాటు వరుసగా దాడులు చేయడం బకాయిలను వసూలు చేయడంపై దృష్టి పెట్టడంతో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని మిల్లులకు సంబంధించిన లావాదేవీలపై వివరాలు సేకరించి ఈడీకి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ రంగంలోకి వస్తే ప్రభుత్వ ధాన్యం ద్వారా మిల్లర్లు సంపాదించిన ఆస్తులు ఆర్థిక లావాదేవీలే కాకుండా, రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాల ద్వారా కూడగట్టుకున్న ఆస్తులు కూడా బయటపడే అవకాశం ఉంది. 2025-26 సంవత్సరంలో ఖరీఫ్‌లో 1,80,690 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యం రావాల్సి ఉండగా మిలర్లు 72 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేశారు. యాసంగిలో 2,07,073 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ రావాల్సి ఉండగా 25 వేల మెట్రిక్‌ టన్నులు ఇచ్చారు.

ధాన్యం పక్కదారి...

సీఎంఆర్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై జరిమానాలు, కేసులు విధిస్తున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా రైస్‌ మిల్లులకు అప్పగించిన ధాన్యంలో చాలా మిల్లులు పక్కదారి పట్టిస్తున్న తీరు వెలుగులోకి వస్తున్న సందర్బాలు ఉన్నాయి. ఇటీవల ధాన్యం కొనుగోలు సమయంలోనే ధాన్యాన్ని దారి మళ్లించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ను సస్పెండ్‌ చేశారు. దీంతో పాటు ధాన్యం కొనుగోలు వ్యవహారంలో యాసంగి ధాన్యం దారి మళ్లింపు వ్యవహారంలో 10 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. జిల్లాలో యాసంగిలో 3.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో యాసంగిలో 1.83 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1,79,650 దొడ్డు రకం, 7,539 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీని ద్వారా 4 లక్షల 56 వేల 664 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం 4 లక్షల 49 వేల 125 మెట్రిక్‌ టన్నులు, సన్న రకం 7,539 మెట్రిక్‌ టన్నులు వస్తుందని, ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 2.97 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 7539 మెట్రిక్‌ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారు. పౌరసరఫరాల శాఖ ద్వారా 53,704 మంది రైతుల నుంచి 3.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 3,75,345 దొడ్డు రకం ధాన్యం, 631 మెట్రిక్‌ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలులో ఐకేపీ ద్వారా 1,96,268 మెట్రిక్‌ టన్నులు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 1,67,303 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 9,043 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ద్వారా 3,361 మెట్రిక్‌ టన్నులు కొనుగొలు చేశారు. ఇందులో అక్రమంగా ట్రక్‌ షీట్లు సృష్టించి 13 లారీల ధాన్యం పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన అధికారులు సిబ్బందిని సస్పెండ్‌ చేయడంతో పాటు ధాన్యం దారి మళ్లించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకున్నారు. ధాన్యం అక్రమ రవాణాపై చర్యల్లో రూ.18.16 లక్షల నగదు రికవరీ చేయగా మరో రూ.46.21లక్షలు బ్యాంకు ఖాతాల్లో ఫ్రిజ్‌ చేశారు. మిల్లర్లు మాత్రం క్వింటాలు బియ్యానికి 67కిలోల బియ్యం సాధ్యం కాదంటూనే ప్రతి సీజన్లలో ధ్యానం దించుకోవడానికి కొందరు పొటీపడడం గమనార్హం.

Updated Date - Aug 21 , 2026 | 01:24 AM