ఆయిల్‌పామ్ సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:57 PM
ఆయిల్‌పామ్‌ను సాగుచేయడం ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
ఇల్లంతకుంట, మార్చి 17(ఆంధ్రజ్యోతి) : ఆయిల్‌పామ్‌ను సాగుచేయడం ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. జిల్లాలోని ఇల్లంతకుంట, బోయినిపల్లి, కోనరావుపేట, వేములవాడ, గంభీరావుపేట మండలాలలో మంగళవారం 40ఎకరాలలో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం జరుగగా వంతడుపుల గ్రామపంచాయతీ పరిధిలోని నారెడ్డిపల్లె గ్రామంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈసందరర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగుచేయడానికి డ్రిప్ ఇరిగేషన్‌తో పాటు ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలిపారు. పంటకు మద్దతు ధర లభించడమే కాకుండా పంట ఉత్పత్తి సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. మండలానిక దగ్గరిలోని సిద్దిపేట జిల్లా నర్మెట్ల వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు ఇప్పటికే పీఏసీఎస్‌లలో రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. ఆదర్శనీయమైన రైతులు ముందుకు వస్తున్నారని వీరిని చూసి మిగతా రైతులు కూడా ఆయిల్‌పామ్ సాగుకు ముందకు రావాలని పిలుపునిచ్చారు. ఆయిల్‌పామ్ సాగులో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవపాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో శశికళలతో పాటు అధికారులు, రైతులు పాల్గొన్నారు.
గ్రామసమైఖ్య భవనాన్ని వేగంగా పూర్తిచేయాలి
మండలంలోని ముస్కానిపేట గ్రామంలో నిర్మిస్తున్న గ్రామసమైఖ్య భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. మండలంలో మంజూరైన అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు పూర్తిచేయడంతోపాటు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల గణనకు చేస్తున్న ప్రక్రియపై ఎంపీడీఓని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో శశికళ, ఎంపీవో శ్రీనివాస్, ఏఈ రాజేశ్‌లతో పాటు అధికారులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.