డంప్ యార్డు సమస్యకు త్వరలో పరిష్కారం
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:08 AM
డంపింగ్‌యార్డు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును బుధవారం సందర్శించారు. బయోమైనింగ్ ప్రక్రియను పరిశీలించారు.
కరీంనగర్ టౌన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): డంపింగ్‌యార్డు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును బుధవారం సందర్శించారు. బయోమైనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డంప్‌యార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. సీఎం రేవంతర్‌రెడ్డి ఇటీవల చొప్పదండి పర్యటనకు వచ్చిన సందర్భంగా డంప్‌యార్డును తొలగిస్తామని హామీ ఇచ్చారన్నారు. వరంగల్, కరీంనగర్ డంపుయార్డు సమస్యకు ప్రత్యేక చర్యలు తీసుకొని రెండు నగరాల మధ్యలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. డంప్‌యార్డు బయోమైనింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుందని, ప్రత్యేక శ్రద్ధతతో వేస్ట్ మేనేజిమెంట్ విషయంలో ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఇక్కడి యార్డులో పేరుకుపోయిన చెత్తతోపాటు ప్రతిరోజు వచ్చే చెత్తను ప్రక్షాళన చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతిరోజు వచ్చే చెత్తను, పేరుకుపోయిన 4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరో ఏజెన్సీవారు డంప్‌యార్డులో బయోమైనింగ్ చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, పడిశెట్టి భూమయ్య పాల్గొన్నారు.
ఫ ప్రతీ ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలి
ప్రతీ ఒక్కరు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి ఆరోగ్యానికి కాపాడుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన నగరంలోని కమాన్‌చౌరస్తా వద్ద ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆ ప్రాంతంలోని పలు హోటళ్లకు వెళ్లి పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన ఆవశ్యకతను వివరించారు. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.