ముసురుకున్న వాన
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:23 AM
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుసింది. అన్ని ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ముసురు పెట్టింది.
జగిత్యాల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుసింది. అన్ని ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ముసురు పెట్టింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో గోదావరిలోకి స్వల్పంగా వరద నీరు వస్తోంది, కాలువలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లో లెవల్ కాజ్‌వేలపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు మండలాలు, పట్టణాల్లో పాత ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పంట చేలలోకి వర్షపు నీరు చేరి మునిగాయి. చెరువులు, కుంటలు, ఇతర చిన్న నీటి వనరుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్దంగా ఉంది. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌ల నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఫపాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు...
జిల్లాలోని ధర్మపురిలో ఒకటి, సారంగాపూర్‌లో రెండు, మల్యాలలో రెండు, వెల్గటూరులో ఒకటి, మేడిపల్లిలో రెండు మొత్తంగా 8 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాయికల్‌లో ఒకటి, బీర్‌పూర్‌లో ఒకటి, ఎండపల్లిలో మూడు ప్రాంతాల్లో మొత్తంగా ఐదు ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ రహదారులు ధ్వంసం అయ్యాయి. జగిత్యాల రూరల్‌లో ఒకటి, ధర్మపురిలో ఒకటి మొత్తంగా రెండు ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ రహదారులు ధ్వంసం అయ్యాయి. సారంగాపూర్‌లోని బతుకమ్మ కుంట తెగిపోయింది. జగిత్యాల రూరల్ మండలంలో ఒక చెరువు నిండి మత్తడి పారుతోంది.
ఫసాగుకు ప్రాణం పోసిన వర్షాలు...
మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో వానాకాలం సీజన్‌పై అన్నదాతల ఆశలు సన్నగిల్లాయి. వర్షాలు లేకపోవడంతో వరి నార్లు ముదిరిపోయాయి. జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల ఆధారంగా వరినారు వేసుకున్న పలువురు రైతులు ప్రస్తుతం వరినాట్లు వేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, పసుపు, పప్పు ధాన్యాలు, ఇతర ఆరుతడి పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేసింది. వరి నాట్లు వేయడం, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ బిజీ అయ్యారు.
ఫవర్షపాతం ఇలా..
జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 176.3 మిల్లీమీటర్లు, బుగ్గారం మండలం సిరికొండలో 169.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముసురుతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా రాయికల్ మండలం అల్లీపూర్‌లో 68.5 మిల్లీమీటర్లు, రాయికల్‌లో 60.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఫపెరుగుతున్న గోదావరి ప్రవాహం...
వెల్గటూరు మండలం కోటిలింగాల వద్ద గోదావరిలోకి వరద నీరు చేరి స్వల్పంగా నీటి మట్టం పెరుగుతోంది. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన కేంద్రంలో గల గోదావరిలోకి వాగులు, కాలువల ద్వారా వరద నీరు వస్తోంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్ తదితర మండలాల్లో సైతం గోదావరిలోకి నీటి ప్రవాహం వస్తోంది.
ఫనిలిచిన రాకపోకలు...
ధర్మపురి మండలంలోని ఆకుసాయిపల్లి శివారులో గల లో లెవల్ వంతెన నీటిలో మునగడంతో జగిత్యాల-మంచిర్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతారం సమీపంలో గల లో లెవల్ వంతెన నీటిలో మునగడంతో జగిత్యాల- ధర్మపురిలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెల్గటూరు మండలం పైడిపల్లి-గొడిసెలపేట మధ్యలో ఉన్న వంతెనపై నుంచి నీరు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బీర్‌పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామం రగుబ కాలనీ సమీపంలోని రెండు వాగుల వరద నీరు రహదారిపై ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగు వర్షం నీటితో పారుతుండడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మల్లాపూర్-మొగిలిపేట మధ్య గల వర్షపు నీరు రహదారిపై ప్రవహిస్తోంది.
ఫఎక్స్‌కవేటర్ సహాయంతో తరలింపు..
జిల్లా కేంద్రంలోని ఆరో వార్డులో గల వెంకటాద్రినగర్, గోవిందుపల్లి చర్చి సమీపంలో గల కాలువ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎక్స్‌కవేటర్ సహాయంతో అధికారులను చెత్తాచెదారాన్ని తొలగించి నీటిని దిగువకు పంపుతున్నారు. గోవిందుపల్లి నుంచి జగిత్యాలకు రాకపోకలు నిర్వహించే విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు, ఇతరులను ఎక్స్‌కవేటర్ సహాయంతో బ్రిడ్జి దాటించారు.
ఫవర్షంతో ఇక్కట్లు...
జగిత్యాల పట్టణంలోని 26వ వార్డులో ఓ చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. ధర్మపురి మండలం నరసయ్యపల్లి క్రాస్ రోడ్డు వద్ద 63వ నంబరు జాతీయ రహదారిపై వర్షానికి ఓ చెట్టు కూలింది. వెల్గటూరు మండలంలోని రామ్నూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లోని పలు వార్డులు, కాలనీల్లో రహదారులపై వరద నీరు ప్రవహించింది. మురికి కాలువలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. వెల్గటూరు మండలం కుమ్మరిపల్లిలో జక్కుల సత్య నారాయణ అను రైతుకు చెందిన సుమారు 4 ఎకరాల పంట పొలం వర్షం నీటితో మునిగింది. మెట్‌పల్లి పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని నగర్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు భారీగా నిలిచి చెరువును తలపించింది.
ఫకలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
వర్షాల వల్ల అత్యవసర పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే కంట్రోల్‌రూమ్ నంబర్ 7989193131కు సమాచారం అందించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు, నీటి ప్రవాహాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకూడదన్నారు.