Share News

తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:39 AM

నగరపాలక సంస్థ విడుదల చేసిన కరీంనగర్‌ ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది. డివిజన్ల వారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆ డివిజన్‌లోని ఇంటి నంబర్లు, ఓటర్ల పేర్లకు బదులుగా ఇతర డివిజన్లు, కార్పొరేషన్‌ పరిధిలో లేని ఇతర మండలాలు, గ్రామాలకు సంబంధించిన ఇంటినెంబర్లు, ఓటర్ల పేర్లు కనిపిస్తున్నాయి.

తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ విడుదల చేసిన కరీంనగర్‌ ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది. డివిజన్ల వారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆ డివిజన్‌లోని ఇంటి నంబర్లు, ఓటర్ల పేర్లకు బదులుగా ఇతర డివిజన్లు, కార్పొరేషన్‌ పరిధిలో లేని ఇతర మండలాలు, గ్రామాలకు సంబంధించిన ఇంటినెంబర్లు, ఓటర్ల పేర్లు కనిపిస్తున్నాయి. ఈ జాబితా చూసి మాజీ కార్పొరేటర్లు, ఔత్సాహిక అభ్యర్థులు అవాక్కవుతున్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఈనెల 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ప్రకటించడంతో ఫిర్యాదు చేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం మొదటి రోజున నలుగురు తమ అభ్యంతరాలతో మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫ ఏడో డివిజన్‌లో అత్యధికం.. 14వ డివిజన్‌లో అత్యల్పం

గురువారం రాత్రి ప్రకటించిన కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన డివిజన్ల వారి ఓటర్ల ముసాయిదా జాబితా మేరకు నగరంలో 3,40,775 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,69,763 మంది పురుషులు, 1,70,969 మంది మహిళలు, 43 మంది ఇతరులు ఉన్నారు. ఒక్కో డివిజన్‌కు 4,500 నుంచి 6,000 వరకు ఐదు శాతం హెచ్చుతగ్గులతో జాబితాను తయారు చేశారు. ఏడో డివిజన్‌లో అత్యధికంగా 6,486 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా 14వ డివిజన్‌లో 4,210 మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన 64 డివిజన్లలో ఐదు వేల నుంచి 6,300 వరకు ఓట్లతో ముసాయిదా ఓటరు జాబితాను తయారు చేశారు. ఈ జాబాతాను మున్సిపల్‌, ఆర్డీవో, కలెక్టర్‌, అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అతికించారు. శుక్రవారం ఉదయం నుంచే 66 డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే వారు ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించారు. ఆయా డివిజన్ల స్వరూపం, ఓటర్ల సంఖ్య, ఇంటి నంబర్లను చూసి ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ మారిన డివిజన్ల స్వరూపం

గతంలో కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా కొత్తపల్లి మున్సిపాలిటీ, చింతకుంట, లక్ష్మిపూర్‌, మల్కాపూర్‌, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో డివిజన్ల సంఖ్య 66కు చేరింది. డివిజన్ల స్వరూపం మారింది. కొత్తగా ఏర్పడిన డివిజన్‌ నంబర్లతో ఆయా ప్రాంతాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఓటరు జాబితా చూసుకొని, వాటి ఆధారంగా ఓటర్లను కలుసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. చాలా మంది డివిజన్లలో ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు ఉండడంతో అభ్యంతరాలతో ఫిర్యాదు దాఖలు చేసేందుకు వారికి అనుకూలంగా ఉన్న ఇంటి నంబర్లు, ప్రాంతాలను పరిశీలించుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ కోసం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని పౌర సేవా కేంద్రంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్‌లో అభ్యంతరాలను పని వేళల్లో సమర్పించాలని టౌన్‌ప్లానింగ్‌ డీసీపీ ప్రకటించారు.

ఫ పలువురి అభ్యంతరాలు

నగరంలోని 66 డివిజన్ల ముసాయిదా ఓటర్ల జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి తుదిజాబితా తయారు చేయాలని ఔత్సాహిక అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 64వ డివిజన్‌ పరిధిలో 4,514 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటరు జాబితాలో ప్రకటించారు. గతంలో ప్రకటించిన మేరకు డివిజన్‌లో ఇంటినెంబర్లు 2-7-823 నుంచి 2-7-1009, 2-8-1 నుంచి 2-8-333, 2-9-1 నుంచి 2-9-142, 2-10-01 నుంచి 2-10-18, 7-1-1 నుంచి 7-1-27 వరకు ఇంటి నంబర్లు ఉన్నాయి. ముసాయిదా ఓటరు జాబితాలో ఈ ఇంటి నంబర్లతోపాటు కార్పొరేషన్‌ పరిధిలోని చింతకుంట, రేకుర్తి, సీతారాంపూర్‌ ప్రాంతాల ఇంటి నంబర్లు, ఓటర్ల పేర్లు, కోహెడ, దేశాయిపల్లి, గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌, కురిక్యాలతోపాటు ఇతర గ్రామాలకు సంబంధించిన 900కుపైగా ఓట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ డివిజన్‌లోని ముసాయిదా ఓటరు జాబితా 60 పేజీలతో ఉంది. వాటిలో 320 ఓటర్ల పేర్లను ఇంటి నంబర్లను పరిశీలిస్తే ఈ డివిజన్‌కు సంబంధించి ఎనిమిది ఓట్లు మాత్రమే ఉన్నాయని మాజీ కార్పొరేటర్‌ వాల రమణారావు తెలిపారు. మిగిలిన 312 ఓట్లు ఇతర ప్రాంతాలకు సంబంధించినవేనని, మొత్తం జాబితా ప్రకారంగా కనీసం 1000 ఓట్ల మేరకు ఇతర ప్రాంతాల ఓటర్లను ఈ డివిజన్‌లో చేర్చారని ఆయన అన్నారు. ఇది ముసాయిదా ఓటరు జాబితానేనని, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈనెల 10న తుదిఓటరు జాబితాను విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 03 , 2026 | 12:39 AM