అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:15 AM
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధానకార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. ఏఐఎఫ్‌బీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
సుభాష్‌నగర్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధానకార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. ఏఐఎఫ్‌బీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లో కిరాయి ఇళ్లలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న పేదలు ఎందరో ఉన్నారని తెలిపారు. భర్తను కోల్పోయి, పిల్లలను సాకుతూ అత్యంత దీన స్థితిలో బతుకులీడుస్తున్న వితంతువులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాజకీయ సిఫార్సులతో జరిగిన ఈ కేటాయింపులపై ఉన్నతస్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.