దీపావళి కానుకగా పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:22 AM
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా దీపావళి కానుకగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందిస్తున్నామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ అన్నారు.
- 633 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, తాళం చెవుల అందజేత
- రెండేళ్లలో రామగుండాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం
జ్యోతినగర్, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా దీపావళి కానుకగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందిస్తున్నామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ అన్నారు. శనివారం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రెండో డివిజన్ జంఘాలపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, తాళం చెవులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిర్మించిన ఇళ్లను అదనపు నిధులు వెచ్చించి నివాసయోగ్యంగా మార్చామని తెలిపారు. విద్యుత్, తాగునీరు, రహదారి సౌకర్యాలను కల్పించేందుకు సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేలు మారినప్పుడల్లా లక్కీడ్రా పేరుతో లబ్ధిదారులను మార్చేవారని, తమ ప్రభుత్వం గతంలో ఎంపిక చేసిన వారికే ఇళ్లను కేటాయించామని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పేదలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రామగుండం నవనిర్మాణంలో భాగంగా ఇప్పటికే 1200 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలో నగరాల్లోని అపార్ట్‌మెంట్ల తరహాలో ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 1200 మందికి పట్టాలు అందించామని, మరో 11 వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను కూడా త్వరలో నెరవేరుస్తామన్నారు. రామగుండాన్ని విద్యా, వైద్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రూ.50 కోట్లతో ఏటీసీ, రూ.230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.12 కోట్లతో బాలుర జూనియర్ కళాశాల నిర్మాణంతోపాటు మెడికల్ కళాశాలలో పీజీ సీట్ల పెంపు, పారామెడికల్, నర్సింగ్ కళాశాలలు, పీజీ కళాశాలకు నూతన భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సింగరేణి ఆసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, భూగర్భ జలాల సంరక్షణకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ దీపావళికి సొంతింట్లో లక్ష్మీపూజ చేసుకోవాలనే ఉద్దేశంతో వారం రోజుల ముందుగానే తాళాలు అందిస్తున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ ఇళ్ల ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులే వాటిలో నివాసం ఉండాలని, ఇతరులకు బదిలీ చేయరాదని స్పష్టం చేశారు. ఇళ్లను ఖాళీగా ఉంచకూడదని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పవన్‌కుమార్ మాట్లాడుతూ ఒక్కో బ్లాక్‌లో 12 ఇళ్ల చొప్పున మొత్తం 56 బ్లాక్‌లు నిర్మించినట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ వెంగళ బాపు, పలువురు కార్పొరేటర్లు, తహసీల్దార్ రవీందర్‌రావు, ఎన్‌పీడీసీఎల్ డీఈ ప్రభాకర్, ఆర్‌అండ్‌బీ డీఈ రషీద్, ఎమ్మెల్యే సతీమణి మనాలీ రాజ్‌ఠాకూర్, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.