Share News

అధైర్య పడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:30 AM

కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2 కెనాల్‌ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్డీవో పులి మధుసూదన గౌడ్‌ పేర్కొన్నారు.

అధైర్య పడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
గ్రామ సభలో మాట్లాడుతున్న ఆర్డీవో మధుసూదన గౌడ్‌

- ఆర్డీవో మధుసూదన గౌడ్‌

వెల్గటూర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2 కెనాల్‌ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్డీవో పులి మధుసూదన గౌడ్‌ పేర్కొన్నారు. వెల్గటూర్‌, రాజక్కపల్లి మధ్యన పెద్దవాగుపై రెండు వరుసల బ్రిడ్జి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో బుధవారం వెల్గటూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ బండమీది కవిత గోపి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఆర్డీవో పులి మధుసూదన, తహసీల్దార్‌ శేఖర్‌ సమావేశంలో పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌ మానేర్‌ రిజార్వాయర్‌కు అదనపు టీఎంసీ ఎత్తిపోయడానికి వీలుగా వెల్గటూర్‌ శివారులో పంప్‌ హౌస్‌ నిర్మాణంలో భాగంగా పెద్ద వాగుపై నిర్మిస్తున్న రెండు వరుసల బ్రిడ్జి నిర్మాణంలో 14 మంది రైతులు 1.07 ఎకరాల భూమిని కోల్పోతున్నారు. రాజక్కపల్లి సర్పంచ దొరిశెట్టి మల్లేశం మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో గ్రామ రైతులు గతంలో సుమారు 75 ఎకరాల భూములు కోల్పోయారని ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని అధికారుల దృష్టికి తెచ్చారు. రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అధికారులను కోరారు. ఆర్డీవో మాట్లాడుతూ ప్రజా ప్రయోజన అవసరాల కోసం తమ వంతు సహకారం ఉంటుందన్నారు. రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కృపాకర్‌, రెవెన్యూ అధికారులు రాజేశ్వరి, రాంరెడ్డి, ఇరిగేషన అధికారి రాకేష్‌, ఉప సర్పంచ గండ్ర ప్రతాప్‌రావు, వార్డు సభ్యులు సందీప్‌రెడ్డి, సురేష్‌, నరేష్‌, రజిత, మానస పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:30 AM