Share News

పూర్తయింది.. సర్‌

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:29 AM

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది.

పూర్తయింది.. సర్‌

- జిల్లా ఓటర్లు 9,10,567

- తగ్గిన ఓటర్ల సంఖ్య 1,78,523

- వంద శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

- కరీంనగర్‌ నియోజకవర్గంలో 1,01,813 ఓట్ల తొలగింపు

- ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లావ్యాప్తంగా 1,78,523 ఓటర్లు తగ్గగా అత్యధికంగా కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1,01,813 ఓటర్ల సంఖ్య తగ్గింది. మానకొండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అతి స్వల్పంగా 19,710 ఓట్లు మాత్రమే తగ్గాయి. చొప్పదండిలో 28,614 మంది, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 28,386 మంది ఓటర్లు తగ్గారు. పట్టణాల్లో జీవించే వారు తాము నివసిస్తున్న నియోజకవర్గంతోపాటు సొంతగ్రామాల్లోనూ ఓటర్లుగా నమోదై ఉంటే వారి ఓట్లు తొలగించారు.

ఫ అత్యధికంగా కరీంనగర్‌లో..

దీంతో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా ఓటర్లు తగ్గారు. చాలా మంది సొంత నియోజకవర్గాల్లోనే ఓటు హక్కు ఉండాలనుకున్న కారణంగా ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తగ్గింది. మ్యాపింగ్‌ చేసిన ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేశారు. అన్‌ కలెక్టబుల్‌ పేరుతో పత్రాలు సేకరించడానికి వీలు లేకుండా ఉన్నవారి పేర్లను, చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. జిల్లాలో సర్‌ ప్రక్రియ మొదట్లో కొంత ఆలస్యంగా సాగినా గడువు దగ్గరపడడంతో డిజిటలైజేషన్‌ను వేగంగా పూర్తి చేశారు. కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్‌ కార్పొరేషన్‌, కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో కలిపి మొత్తం 3,68,832 ఓటర్లకు 2,67,019 ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్‌ అయ్యాయి. 1,01,813మంది ఓటర్లను అన్‌ కలెక్టెబుల్‌ (ఏఎస్‌డి) కేటగిరిలో తొలగించారు. దీంతో 27.6 శాతం ఓటర్ల సంఖ్య తగ్గింది. కరీంనగర్‌ జిల్లా కేంద్రం కావడంతో విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు చాలా మంది మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడితోపాటు వారి స్వగ్రామాలు, పట్టణాల్లో కూడా ఓటర్లుగా నమోదయ్యారు. ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవలసి ఉండడంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిఽధిలో కాకుండా వారి స్వగ్రామాల్లోనే ఓటరుగా నమోదు చేయించుకున్నారు. దీంతో కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఓటర్ల సంఖ్య తగ్గడం ఏ పార్టీకి మేలు చేస్తుంది, ఎవరికి నష్టం కలిగిస్తుంది అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

- చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో కలిపి మొత్తం ఓటర్లు 2,39,716 మంది ఉన్నారు. 2,11,102 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్‌ చేశారు. 88.06 శాతం పూర్తి చేయడంతో ఏసీడీ కేటగిరిలో 28,614ఓటర్లను తొలగించారు.

- మానకొండూర్‌ నియోజకవర్గంలో మానకొండూర్‌, శంకరపట్నం, తిమ్మాపూర్‌, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో 2,26,250 ఓటర్లు ఉండగా 2,06,540 ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్‌ చేశారు. 91.29 శాతం డిజిటలైజేషన్‌ పూర్తికగా 19,710 మంది ఏసీడీ కేటగిరిలో ఓటర్లను తొలగించనున్నారు.

- హుజూరాబాద్‌ నియోజకవర్గంలో హుజూరాబాద్‌, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని2,54,292 మంది ఓటర్లలో 2,25,906 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్‌ పూర్తికావడంతో మిగిలిన 11.86శాతం ఓటర్లు 28,386 మంది ఏసీడీ కేటగిరిలో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారు.

- జిల్లాలో 10,89,090 మంది ఓటర్లు ఉండగా ఏసీడీ కేటగిరిలో 1,78,523 ఓట్లు తొలగించడంతో జిల్లా ఓటర్ల సంఖ్య 9,10,567కు తగ్గింది. జిల్లాలో మొత్తం ఓటర్లలో 83.61 శాతంగా వివరాలు నమోదు కావడంతో మిగిలిన 16.39 శాతం ఓటర్లను మృతిచెందడం, ఏసీడీ వంటి వాటితో తొలగించారు. తుది ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి దీనిపై అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు తప్పొప్పులను సవరిస్తారని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 11 , 2026 | 01:29 AM