Share News

సంక్షేమ పథకాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వవద్దు

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:33 PM

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపనీలకు ఇవ్వవద్దని తెలంగాణ భవన నిర్మాణ, ఇతర కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఎడ్ల రమేశ్‌ డిమాండ్‌ చేశారు.

సంక్షేమ పథకాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వవద్దు

సుభాష్‌నగర్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపనీలకు ఇవ్వవద్దని తెలంగాణ భవన నిర్మాణ, ఇతర కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఎడ్ల రమేశ్‌ డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాదవశాత్తు మరణం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపనీల ద్వారా అమలు చేయాలని 2025 జూలై 22న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన మొత్తాన్ని ప్రైవేట్‌ కంపనీలకు దోచి పెడుతోందని విమర్శించారు. వివాహ కానుక, ప్రసూతి కానుక, హాస్పిటల్‌ ఖర్చులు, అంతిమ సంస్కారాల ఖర్చుల వంటి పథకాలను ప్రభుత్వం, బోర్డు అధికారులు అనేక కారణాలు చూపి కార్మికులకు అందకుండా చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నం. 12ను రద్దు చేసి, వెల్ఫేర్‌ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల నిధులు వెంటనే విడుదల చేయాలని, 13 లక్షల కార్మికులకు లేబర్‌ కార్డులను యుద్దప్రాతిపదికన రెన్యూవల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కదిరె రమేశ్‌, ఉపాధ్యక్షుడు పళ్ల తిరుపతి, కోశాధికారి వట్టి జగదీష్‌, సైదాపూర్‌ మండల అధ్యక్షుడు రాధారపు సంపత్‌, ప్రధాన కార్యదర్శి దొకిడి తిరుపతి, కరీంనగర్‌ అర్బన్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాల్వ సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:33 PM