Share News

సోషల్‌మీడియాలో వచ్చే సందేశాలను చూసి మోసపోవద్దు

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:36 PM

సోషల్‌ మీడియాలో వచ్చే సందేశాలను చూసి మోసపోవద్దని ఎస్పీ మహేష్‌ బీ గితే కోరారు.

సోషల్‌మీడియాలో వచ్చే సందేశాలను చూసి మోసపోవద్దు

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : సోషల్‌ మీడియాలో వచ్చే సందేశాలను చూసి మోసపోవద్దని ఎస్పీ మహేష్‌ బీ గితే కోరారు. సిరిసిల్ల పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్‌వరకు సైబర్‌ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మహేష్‌ బీ గితే ర్యాలీని ప్రారంభించి విద్యార్థు లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ ఘాట్‌లో జరిగిన సమావేశం లో ఎస్పీ మాట్లాడారు. సైబర్‌ మోసాలపై ప్రజలు, విద్యార్థులను అప్రమత్తం చేసి, సురక్షితమైన డిజిటల్‌ వినియోగంపై చైతన్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సైబర్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను మోసగిస్తున్నారని, అత్యాశకు లోనై వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని సూచించారు. సైబర్‌ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, అవగాహన ద్వారానే సైబర్‌ మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చ న్నారు. అనుమానాస్పద కాల్స్‌తో పాటు వచ్చే సందేశాలు వచ్చిన వెంటనే 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌తో పాటు సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేయాలని సూచించారు. విద్యార్థులు సోషల్‌ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, సోషల్‌ మీడియా ద్వారా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, స్నేహ అభ్యర్థనలకు స్పందించవద్దని, సోషల్‌ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఎవరితో పంచుకోవద్దని తెలిపారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే, ముఖ్యంగా గోల్డెన్‌ హవర్‌ (మొదటి గంట)లోనే 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. గోల్డెన్‌ హవర్‌లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ ర్యాలీలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు గణేష్‌, నాగరాజు, జునైద్‌, సైబర్‌ సిబ్బం ది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:36 PM