డైవర్ట్.. ఎస్కేప్...
ABN , Publish Date - May 05 , 2026 | 01:29 AM
కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్‌లో ఆదివారం దోపిడీ దొంగల ముఠా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ‘డైవర్ట్ అండ్ ఎస్కేప్’ పాలసీని అమలు చేసింది.
కరీంనగర్, మే 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్‌లో ఆదివారం దోపిడీ దొంగల ముఠా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ‘డైవర్ట్ అండ్ ఎస్కేప్’ పాలసీని అమలు చేసింది. జ్యోతినగర్ పీఎంజే జ్యువెలర్స్ నుంచి బయటకు వచ్చిన నిందితులు ద్విచక్రవాహనాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కార్యాలయం వైపు కొంత దూరం వరకు వెళ్లి అక్కడి నుంచి విద్యానగర్ మీదుగా మల్కాపూర్ మార్గంలో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. పీఎంజే జ్యువెలర్స్ పక్కనే జగిత్యాల ప్రధాన రహదారి ఉన్నా.. మల్కాపూర్ వైపు వెళ్ళిన దొంగలు పోలీసులను తప్పుదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేశారు. మల్కాపూర్ నుంచి రాజన్నసిరిసిల్ల ద్వారా కామారెడ్డి నిజామాబాద్‌వైపు వెళ్లి అక్కడి నుంచి రైలు ద్వారా మహారాష్ట్రకు పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. ఆ మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగానే మల్కాపూర్ చౌరస్తా నుంచి వెలిచాల ఎక్స్‌రోడ్ మీదుగా ఎస్సారెస్పీ కాలువ వెంట వెళ్లినట్లు గుర్తించారు. రామడుగు మండలం రుద్రారం, రంగసాయిపల్లి, లక్ష్మీపూర్ టన్నెల్ నుంచి వరద కాలువ మీదుగా గంగాధర మండలం కోట్ల నర్సింగాపూర్‌నుంచి పెగడపల్లి వైపు పారిపోయారు. పోలీసులు ఆదివారం రాత్రి ఈ మార్గాల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ సమాచారం వెల్లడైనట్లు తెలిసింది. అప్పటికే దొంగలు జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించారు. మంచిర్యాల, బెల్లంపల్లి లేదా నిజామాబాద్ వైపు వెళ్లి అక్కడి నుంచి రైలు మార్గంలో రాష్ట్రం దాటి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
- సీసీ కెమెరాల భయంతోనే....
ప్రధాన రహదారులు, పట్టణాల మీదుగా వెళితే సీసీ కెమెరాలలో రికార్డు అవుతామని భావించిన నిందితులు గ్రామీణప్రాంత మార్గాలను ఎంచుకుని ఆ మార్గాల ద్వారా జిల్లా దాటినట్లు పోలీసులు భావిస్తన్నారు. మల్కాపూర్ వద్ద, గంగాధర మండలం కోట్ల నర్సింగాపూర్ వద్ద పంటపొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న ఒకటి రెండు సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డయ్యాయి. పోలీసులు స్థానిక సీసీ కెమెరాల్లో దుండగులను గుర్తించి ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గంగాధర, రామడుగు మండలాల్లో కూంబింగ్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేసినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దుండగులు అప్పటికే తప్పించుకున్నారు.
- బీహార్‌కు స్పెషల్‌టీం...
దోపిడీ దొంగలు ఉపయోగించిన సెల్‌ఫోన్, బైక్‌లు, వారి ముఖ కవళికల ద్వారా బీహార్‌కు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులను కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం ఉదయమే కరీంనగర్ నుంచి బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు స్పెషల్ టీంలు వెళ్లాయి. అక్కడి పోలీసులు, స్థానికులకు నిందితుల ఫోటోలు చూపించి, వారి స్థానికత, షెల్టర్ల కోసం ఆరా తీస్తున్నారు. మూడు రాష్ట్రాలలోని పాత నేరస్థుల డాటా ద్వారా పీఎంజే దోపిడీ దొంగల ఫోటోలను పోల్చిచూస్తూ ఆచూకీని కనగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.
- గూగుల్ లొకేషన్....
పీఎంజే జ్యువెలర్స్‌లో దోపిడీ చేసిన నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయేందుకు ముందుగానే ఒక పథకం రచించి పక్కాగా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు గూగుల్ లొకేషన్ సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దుండగులు స్థానికులు కాదని బిహార్ లేదా మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు చెబుతున్నారు. వారికి స్థానికంగా రహదారులపై అంతగా అవగాహన ఉండదు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల మీదుగా పారిపోయేందుకు గూగుల్ మ్యాప్ ఆధారంగా ముందుగానే వారి సెల్‌ఫోన్‌లలో లొకేషన్ సెట్ చేసుకుని పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. మొదట షోరూంలోకి ప్రవేశించిన వ్యక్తి తెలుగులోనే మాట్లాడినట్లు సిబ్బంది చెబుతున్నారు. స్థానికంగా తెలంగాణకు చెందిన పాత నరేస్థుడు వారికి సహాయపడ్డాడా? లేదా గ్రానైట్ క్వారీల్లో, ఇతర ఉపాధి కోసం వచ్చిన బిహార్, మహారాష్ట్రకు చెందిన ఎవరైనా ఈ ముఠాకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి ద్వారా పీఎంజే జ్యువెలర్స్ వద్ద రద్దీ, భద్రత, తప్పించుకునే మార్గాల సమాచారాన్ని సేకరించి ఉంటారని భావిస్తున్నారు.
- కరీంనగర్‌కు టెక్నికల్, క్రైం టీంలు...
పీఎంజే జ్యువెలర్స్‌లో దోపిడీతో పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు లైన్‌లోకి వచ్చి నిందితులను పట్టుకునేందుకు రెండు రోజులుగా స్థానిక అధికారులతో సమీక్ష జరుపుతూ ఎప్పటికప్పుడు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, గాయపడిని సిబ్బందితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. దుండగుల సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా, ఫింగర్ ప్రింట్, సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా వారిని గుర్తించేందుకు హైదరాబాద్ నుంచి టెక్నికల్ టీంలతోపాటు క్రైం టీంలు కూడా కరీంనగర్‌కు చేరుకున ్నాయి. ఆధారాలను నిశితంగా పరిశీలించి దుండగులకు చెందిన కొన్ని లీడ్స్ స్థానిక పోలీసులకు ఇచ్చినట్లు తెలిసింది.
- మూడు చోట్ల టవర్ డంప్‌తో....
పీఎంజే జ్యువెలర్స్ దొంగలను పట్టుకునేందుకు వారి సెల్‌ఫోన్‌లను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దుండగుల సెల్‌ఫోన్ నంబర్లను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దోపిడి జరిగిన 11 నిమిషాల సమయంలో ఆ ప్రాంతంలో ఏయే ఫోన్ నంబర్లు పనిచేశాయనేది తెలుసుకునేందుకు టవర్ డంపుకు ప్రయత్నిస్తున్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద ఒక సెల్‌ఫోన్‌ను కిందపడేసిన చోట, గంగాధర మండలం కోట్ల నర్సింగాపూర్ వద్ద టవర్ డంపును తీస్తున్నారు. ఒక్కో చోట వేల ఫోన్ నంబర్లు వస్తుంటాయి, వీటిలో అనుమానిత ఫోన్ నంబర్లను వేరు చేసి, ఆ నెంబర్ల నుంచి ఎవరెవరికి? ఏయే ప్రాంతాలకు కాల్స్ వెళ్ళాయి అనేది ఆరా తీస్తే నిందితులను గుర్తించవచ్చు. ఈ టవర్‌డంప్ ఆధారంగా ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించారని తెలుస్తోంది. బట్టతల వ్యక్తి నల్గొండ జిల్లాలో ఒక దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అతని స్వస్థలానికి ఇప్పటికే ఒక స్పెషల్‌టీం వెళ్లినట్లు సమాచారం. నిందితులు పారిపోతూ కోట్ల నర్సింగాపూర్ వద్ద బైక్‌లను మార్చినట్లు తెలిసింది.