రేపు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సభ
ABN , Publish Date - May 21 , 2026 | 12:49 AM
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 22 వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సభ నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు.
సిరిసిల్ల, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 22 వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సభ నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలపై విస్తృత అవగాహన కల్పించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, స్థానిక సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడంతో పాటు ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయడం, తదితర అంశాలపై ఈ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగం గా 99 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహించడంతో పాటు ప్రతీ వారం వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి సభ సిరిసిల్ల పట్టణం రగుడు సమీపంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అలాగే యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా 22 వ తేదీ సాయంత్రం సిరిసిల్ల పట్టణం కొత్త చెరువు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ వివరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిం చడానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసాచారి, ఎల్డీఎం మల్లికార్జునరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు.