జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:53 AM
రాష్ట్రంలో జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్రంలో జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ అంశంపై జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రధానంగా హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు మళ్లీ తెరపైకి వస్తున్నది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతారా... చిన్న జిల్లాలను ఎత్తేసే ప్రతిపాదనలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాను కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కలిపేస్తారా అన్న అంశాలపై ఉమ్మడి జిల్లాలో చర్చించుకుంటున్నారు. అధికార కాంగ్రెస్‌తోపాటు అన్ని రాజకీయపార్టీల్లో, ఉద్యోగ వర్గాల్లో, ప్రజల్లో ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఫ హుస్నాబాద్ బాధ్యత మంత్రి పొన్నంపైనే..
హుస్నాబాద్‌ను కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం సిద్దిపేట జిల్లాలో కలిపారు. దీంతో ఈ నియోజకవర్గం మూడు జిల్లాల్లో చేరింది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో కలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి, ప్రస్తుత రాష్ట్రమంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ తాము అధికారంలోకి వస్తే హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరుపుతామని రెవెన్యూ మంత్రి ప్రకటించడంతో ఈ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఆయా మండలాల ప్రజలు నుంచి వస్తున్నది. ఇదే సమయంలో మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉండగా దానిని కూడా కరీంనగర్ జిల్లాలో కలుపాలని ప్రజలు కోరుతున్నారు. బెజ్జంకి మండలాన్ని కరీంనగర్‌లో చేర్పించాలనే లక్ష్యంతో సాధన సమితి ఏర్పాటై గతంలో ఉద్యమాన్ని చేపట్టింది. అక్కడి ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చి కచ్చితంగా మండలాన్ని కరీంనగర్ జిల్లాలో చేర్చే దిశగా కృషిచేయాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనే ఈ బాధ్యత ఉన్నట్లు ప్రజలు పేర్కొంటూ గతంలో ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. పొన్నం ప్రభాకర్ కూడా ఈ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలిపితే రాజకీయంగా తన సొంత జిల్లాలో మంత్రిగా తనకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన తప్పక ప్రయత్నిస్తారని అనుకుంటున్నారు.
ఫ పీవీ జిల్లా కల నెరవేరేనా..
దేశానికి తొలి తెలుగు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి కొత్తబాటలు వేసిన వ్యక్తిగా పేరుపొందిన పీవీ నర్సింహారావు పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నది. ఆయన స్వగ్రామమైన వంగర హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినది. ఈ గ్రామం ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉన్నది. మరోవైపు హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా బలంగా వస్తున్నది. గతంలో ఆరు నెలలపాటు ఈ జిల్లా సాధన కోసం ప్రజలు జేఏసీగా ఏర్పడి పోరాడారు. రాజకీయ తోడ్పాటు మొక్కుబడిగానే లభించడంతో చివరకు ఆందోళనలు విరమించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కమలాపూర్ మండలం ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉన్నది. ఈ మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపి హుజూరాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలను రెండింటిని కలిపి పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని, ఈ జిల్లాకు హుజూరాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడు హుజూరాబాద్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లు కూడా ఈ జిల్లాలో చేరిపోతాయి. పీవీ నర్సింహారావు పేరును జిల్లాకు పెట్టడం సముచితంగా, గౌరవంగా ఉంటుంది. ఆయన పేరిట జిల్లాను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన కృతజ్ఞతను, గౌరవాన్ని చాటుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ రాజన్న సిరిసిల్ల జిల్లా సంగతేంటి..?
చిన్న జిల్లాలను కొన్నింటిని ఎత్తివేస్తామని మంత్రి పొంగులేటి సుధాకర్ పేర్కొనడంతో ఆ జాబితాలో రాజన్న సిరిసిల్ల కూడా ఉంటుందనే చర్చ మొదలైంది. 85వేల పై చిలుకు జనాభాతోనే ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జిల్లాలోని 12 మండలాలు ఉండగా అందులో తంగళ్లపల్లి, రుద్రంగి, వేములవాడ రూరల్ అనే మూడు మండలాలను జిల్లా ఏర్పాటు కోసమే కొత్తగా ఏర్పాటు చేశారు. అంతకు ముందే వీర్నపల్లిని మండలంగా గుర్తించారు. తక్కువ జనాభాతో చిన్న జిల్లాగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లాను పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కరీంనగర్‌లో కలిపే అవకాశముందని భావిస్తున్నారు.