సాగునీటి పంపిణీలో వివక్ష
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:26 PM
కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతులకు సాగునీటి పంపిణీలో వివక్ష చూపిస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
చొప్పదండి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతులకు సాగునీటి పంపిణీలో వివక్ష చూపిస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. చొప్పదండిలోని డి-86 కాలువ వద్ద సాగునీటి కోసం రైతులతో కలిసి బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లిప్రాంత రైతులకు పంటలు ఉన్నట్లే తమ ప్రాంత రైతులకు పంటలు ఉన్నాయన్నారు. నీళ్లు విడుదల చేయకుంటే బ్రిడ్జిపైనుంచి దూకుతానని ఆయన హెచ్చరించారు. రైతులు నీటికోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. సాగునీటిని సమర్థవంతంగా పంపిణీ చేసి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడినా సాగునీరు అందకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్, చొప్పదండి ప్రాంతాల రైతులకు సమానంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెగ్యులేటరీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ పీఏసీఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్కుమార్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొక్కారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఇరుకుల్ల సర్పంచ్ బుర్ర రమేష్గౌడ్, ఆకుల గిరి, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతినాయక్, మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు పాల్గొన్నారు.