వివక్ష కొనసాగుతోంది..
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:57 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ నియోజకవర్గాలపై వివక్ష కొనసాగుతోంది.
- ఎస్సీ నియోజకవర్గాలకు అదనపు నిధులు ఇవ్వాలి..
- కాంగ్రెస్‌లో ‘కవ్వంపల్లి’ వ్యాఖ్యల కలకలం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ నియోజకవర్గాలపై వివక్ష కొనసాగుతోంది. అణచివేత ఆగలేదు.. ఇకపై ఊరుకునేది లేదు.. లిడ్‌క్యాప్ చైర్మన్, అసెంబ్లీ కమిటీలు, బిల్లుల్లో ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటూ మానకొండూర్ శాసనసభ్యుడు, కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వాఖ్యలు అధికార పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దళిత నియోజకవర్గాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలని, ఈ నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కేటాయించే స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ 10 కోట్లు అదనంగా ఇవ్వాలని, ఇందిరమ్మ పథకం కింద వెయ్యి ఇళ్ళు అదనంగా మంజూరు చేయాలని కోరారు. ఆయన మాటల్లో అసంతృప్తి ఎక్కువగా వినిపించిందని పార్టీ నాయకులు అంటున్నారు.
ఫ అధికారిక పదవి లేక..
లిడ్‌క్యాప్ చైర్మన్ పదవి, అసెంబ్లీ కమిటీల చైర్మన్ పదవులు దళితులకు ఇవ్వాలని కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. దీని వెనక దళిత నేతలకు పదవుల కేటాయింపుల విషయంలో వివక్ష చూపిస్తున్నారనే అసంతృప్తి ధ్వనిస్తున్నదని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు కాగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా ఉండగా ఇటీవల కవ్వంపల్లి సత్యనారాయణకు అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ వర్గీకరణపై వేసిన ఉన్నతస్థాయి కమిటీలో సభ్యుడిగా, రోహిత్ వేముల తెలంగాణ బిల్లు 2026 శాసన రూపకల్పన కమిటీలో సభ్యుడిగా ప్రాధాన్యమిచ్చారు. కవ్వంపల్లి సత్యనారాయణ గతంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనను ఆ పదవి నుంచి తప్పించి చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంకు దానిని అప్పగించారు. మేడిపల్లి సత్యానికి అసెంబ్లీ కమిటీ చైర్మన్ పదవి, అడ్లూరికి మంత్రి పదవితోపాటు రెండు కీలక కమిటీల్లో స్థానం కల్పించారు. కవ్వంపల్లికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ పదవిని ఇచ్చారు. అధికార పదవుల్లో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. రాజకీయంగా తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావనకు ఆయన వచ్చి ఉంటారని, అందుకే అసంతృప్తి స్వరాన్ని వినిపిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కవ్వంపల్లి వర్గీయులు మాత్రం అదేమి లేదని, ఆయన నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ దళిత నియోజకవర్గాలను అభివృద్ధిని చేయాలని, అన్ని నియోజకవర్గాల గురించి ప్రస్తావించారని అంటున్నారు.
ఫ కీలక స్థానాల్లో ఉమ్మడి జిల్లా నేతలు
ఉమ్మడి జిల్ల్లాలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంత్రులయ్యారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. విజయరమణారావుకు ఇటీవలే సహాయ మంత్రి హోదా కల్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లిసత్యం డీసీసీ అధ్యక్షుడిగా, అసెంబ్లీ ఎస్సీ సెల్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రామగుండం శాసనసభ్యుడు రాజ్‌ఠాకూర్‌కు అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌కు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు అధికారిక పదవులు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తికి లోనవుతున్నారనే చర్చ జరుగుతోంది.