అధికార పార్టీ నేతలకు నిరాశ
ABN , Publish Date - May 07 , 2026 | 01:14 AM
అధికార కాంగ్రెస్ పార్టీ పల్లె నేతల్లో నామినేటెడ్ పదవుల సంబరానికి బ్రేక్ పడింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అధికార కాంగ్రెస్ పార్టీ పల్లె నేతల్లో నామినేటెడ్ పదవుల సంబరానికి బ్రేక్ పడింది. ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను ఏర్పాటు చేయడానికి గత నెలలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 24 సొసైటీలో పదవులు దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు పార్టీ పెద్దల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. సహకార పదవులు అందుకోబోతున్నామని సంబరపడుతున్న క్రమంలో హైకోర్టు ఆదేశాలతో మళ్లీ పాత పాలకవర్గాలే బాధ్యతలు చేపట్టడం అధికార పార్టీ నేతలకు నిరాశ కలిగించింది. గత ఏడాది ఫిబ్రవరి 14 సింగల్ విండో పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం డిసెంబర్ 19 వరకు గడువు పొడిగించింది. ఆ తర్వాత ప్రభుత్వం సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రాథమిక సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ పలు సింగిల్‌విండో మాజీ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అనేక వాదోపవాదాల తర్వాత తక్షణమే మాజీ చైర్మన్లు, ఆయా పాలకవర్గాల డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని తీర్పునిచ్చింది. ఈమేరకు జిల్లాలోని సొసైటీలో పాత చైర్మన్లు పాలకవర్గాలు మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు వారికి బాధ్యతలను అప్పగిస్తున్నారు. జూన్ 12వ తేదీలోపు సహకార సంఘాల్లో పాత పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించినట్లుగా కోర్టుకు నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత పాలకవర్గాలు మళ్లీ బాధ్యతలు చేపట్టినప్పటికీ జిల్లా సహకార బ్యాంక్ పాలకవర్గాన్ని కూడా రద్దు చేశారు. హైకోర్టు ఆదేశంతో డీసీసీబీ మాజీ డైరెక్టర్లకు, మాజీ చైర్మన్ కూడా తిరిగి బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. అయితే గతంలో కేవలం సింగిల్ విండో పాలకవర్గాలు మాత్రమే హైకోర్టును ఆశ్రయించాయి. వారికి అనుకూలంగా మాత్రమే హైకోర్టు తీర్పు వచ్చింది. డీసీసీబీ పాలకవర్గం కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.
మళ్లీ ఎన్నికల వైపు చూపు..
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు మళ్లీ ఎన్నికల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సింగిల్ విండో పాలకవర్గాలు బీఆర్‌ఎస్ సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించే దిశగా చేసిన క్యాబినెట్ నిర్ణయాన్ని హైకోర్టు తీర్పుతో అయోమయంలో పడేసింది. జిల్లాలోని 24సహకార సంఘాలకు చివరిసారిగా 2020 సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా, 2025 ఫిబ్రవరిలో ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత పదవీకాలం పొడిగిస్తూ వచ్చిన క్రమంలో అధికార పార్టీలో ఎన్నికలు నిర్వహించకపోవడంపై అసంతృప్తి ఏర్పడింది. తాజాగా నామినేటెడ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహించాలని కోరుతున్నారు.
జిల్లాలో 74,728 మంది సభ్యులు
జిల్లాలో ప్రస్తుతం 24 సంఘాలు ఉన్నాయి. వాటి పరిధిలో 74,728 మంది సభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 12,859 మంది సభ్యులు ఉండగా, పెద్దూరు సొసైటీలో 1,336 మంది, నేరెళ్ల సొసైటీలో 1,257 మంది, కోనరావుపేట సొసైటీలో 6,196 మంది, కొలనూరు సొసైటీలో 3,018 మంది, వేములవాడ సొసైటీలో 8,180 మంది, నాంపెల్లి సొసైటీలో 1,191 మంది, రుద్రవరం సొసైటీలో 998 మంది, చందుర్తి సొసైటీలో 3,369 మంది, సనుగుల సొసైటీలో 1,733 మంది, బోయినపల్లి సొసైటీలో 910 మంది, కోరెం సొసైటీలో 1,694 మంది, మాన్వాడ సొసైటీలో 1,163 మంది, నర్సింగాపూర్ సొసైటీలో 1,684 మంది, ఇల్లంతకుంట సొసైటీలో 3,547 మంది, గాలిపెల్లి సొసైటీలో 1,680 మంది, ముస్తాబాద్ సొసైటీలో 2,082 మంది, పోత్గల్ సొసైటీలో 7,169 మంది, గంభీరావుపేట సొసైటీలో 8,183 మంది, కొత్తపెల్లి సొసైటీలో 3,680 మంది, ఎల్లారెడ్డిపేట సొసైటీలో 3,864 మంది, అల్మాస్‌పూర్ సొసైటీలో 2,139 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 1,597 మంది, మానాల సొసైటీలో 199 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతం చర్యలు చేపట్టింది. సహకార రంగంలో వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు విస్తృత సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంది. సహకార పరపతి సంఘాలను పునర్విభజన చేసే కార్యక్రమాలు జరుగుతుండగానే వ్యాపార రంగాల్లోకి సహకార సంఘాలను తీసుకవచ్చే దిశగా పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతోంది. ప్రస్తుతం సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయాలతో పాటు ధాన్యం కొనుగోళ్లతో లాభాలు ఆర్జిస్తున్నాయి. వీటి స్థానంలోనే రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా ఏర్పాటు చేసి ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 311 వ్యవసాయ సహకార పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. దీని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి తేవడం, ఇతర రంగాల్లోనూ అడుగుపెట్టే దిశగా ముందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 24 వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో తొలి విడతగా ఆరు సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. జిల్లాలో వేములవాడ, సనుగుల, నాంపల్లి, అల్మాస్‌పూర్, గంభీరావుపేట, ఇల్లంతకుంట సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసి సేవలు అందించనున్నారు. ఈ సంస్థల్లో వాటాదారులుగా చేర్చుకుంటారు. సభ్యులు తమ వాటాకు అనుగుణంగా ఈక్విటీగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈక్విటీ వాటాగా కేంద్ర ప్రభుత్వం రూ 15 లక్షల వరకు ఒక్కొ సొసైటీకి మ్యాచింగ్ గ్రాంట్ కింద అందిస్తుంది. మూడు సంవత్సరాల నిర్వహణకు ఏడాదికి రూ 6 లక్షల చొప్పున రూ 18 లక్షలు ఇస్తుంది. ప్రస్తుతం సహకార శాఖ అధికారులు ఉద్యోగులకే రైతు ఉత్పత్తి సంస్థల బాధ్యతలను అప్పగించనుంది. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ కింద నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎన్‌సీడీసీ, నాబార్డ్ ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకరానున్నారు.