గ్రామాలకు ‘గౌరవం’
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:46 AM
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు గౌరవప్రదమైన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
- జిల్లాకు 350సామూహిక మరుగుదొడ్లు మంజూరు
- సుమారు రూ.5.07కోట్లకు పైగా కేటాయింపు
- వచ్చే యేడాది జనవరి చివరిలోగా పూర్తిచేయాలని లక్ష్యం
జగిత్యాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు గౌరవప్రదమైన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. స్వచ్ఛభారత్ మిషన్(గ్రామీణ్) ఆధ్వర్యంలో స్వచ్ఛగ్రామాల నిర్మాణమే లక్ష్యంగా గ్రామ పంచాయితీలు, మహిళాసంఘాల(వీవో), ఆలయాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద సామూహిక ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు సుమారు 350మరుగుదొడ్లు మంజూరు కాగా, వీటి నిర్మాణానికి రూ.5.07కోట్లు నిధులు కేటాయించారు. వచ్చే జనవరి చివరి వారం నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
సుమారు రూ.5.07కోట్ల నిధులతో 350మరుగుదొడ్లు..
జిల్లాలో సుమారు రూ.5.07కోట్ల నిధులతో 350సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో గ్రామాల్లో గల మహిళా సంఘాల(వీవో) భవనాల పరిధిలో సుమారు రూ. 3.54కోట్ల నిధులతో 236నిర్మించనున్నారు. ఒక్కోదానికి రూ.1.50లక్షల చొప్పున కేటాయించారు. కాగా 336వీవోల వద్ద నుంచి ప్రతిపాదనలు రాగా సుమారు వందవరకు స్థలసమస్యల వల్ల కేటాయింపులు జరగలేదని అంటున్నారు. ఇదిలా ఉండగా ఆలయాలు, గ్రామపంచాయతీల ఆవరణల్లో సుమారు రూ.1.14కోట్ల నిధులతో 38మరుగుదొడ్లను ఒక్కోదానికి రూ.3లక్షలతో నిర్మించనున్నారు. ఇందులో 9 సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. అదేవిధంగా సుమారు రూ.39.52లక్షలతో 76 సొంతభవనాలు కలిగిన అంగన్వాడీ కేంద్రాల వద్ద ఒక్కోదానికి రూ.52వేల చొప్పున నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ పనులకు అయ్యే వ్యయంలో 70శాతం స్వచ్ఛభారత్ మిషన్ నిధులు, 30శాతం గ్రామపంచాయతీ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సత్యప్రసాద్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
నిర్వహణే ముఖ్యం..
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఈనెల19వతేదీ నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ‘స్వచ్ఛ శౌచాలయ్ - గరిమామయ్ భవష్య’(ఎస్ఎస్జీబీ) అనే పేరుతో ప్రత్యేకప్రచారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతియేడాది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం అయిన నవంబరు 19వ తేదీన కార్యక్రమాలు చేపట్టగా ప్రస్తుత యేడాది వచ్చేనెల 10వ తేదీ వరకు ప్రత్యేక అవగాహణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, పాఠశాలలు, ఇతర సంస్థల మరుగుదొడ్లలో నీటివసతి, పరిశుభ్రత, మహిళలు, బాలికలు, దివ్యాంగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు పరిశీలించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జనకు అడ్డుకట్ట వేయడం, మహిళలు, బాలికలకు గౌరవప్రదమైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
- రఘువరన్, డీఆర్డీవో, జగిత్యాల
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. పలుసొంత భవనాలు కలిగిన అంగన్వాడీ కేంద్రాలు, మహిళాసంఘాల భవనాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, ఆలయాలు తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్నాం. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పల్లెల్లో అవగాహణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నాం.