Share News

కొనుగోళ్లు సజావుగా సాగేనా?

ABN , Publish Date - Apr 26 , 2026 | 01:12 AM

యాసంగి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు.

కొనుగోళ్లు సజావుగా సాగేనా?

- ముమ్మరంగా వరి కోతలు

- ధాన్యం దింపుకునేందుకు ముందుకు రాని మిల్లర్లు

- బాయిల్డ్‌ రైస్‌ కోటా పెంచని కేంద్రం

- రా రైస్‌ ఇచ్చేందుకు మిల్లర్ల వ్యతిరేకత

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

యాసంగి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నా ధాన్యాన్ని దింపుకోవడానికి రైస్‌ మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. యాసంగిలో పండిన ధాన్యం బాయిల్డ్‌ రైస్‌కు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కేంద్రం రా రైస్‌ మాత్రమే తీసుకుంటామని చెబుతోంది. బాయిల్డ్‌ రైస్‌ను పరిమితంగానే తీసుకోవడానికి అంగీకరించడంతో కొనుగోళ్ల విషయంలో చిక్కుముడి పడింది. యాసంగిలో పండించిన ధాన్యం బియ్యంగా మార్చే క్రమంలో విరిగిపోయి 50 శాతం మాత్రమే బియ్యం, మిగతాది నూక వస్తుంది. దీంతో మిల్లర్లు ఆ ధాన్యం తీసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సివిల్‌ సప్లయిస్‌ శాఖ ద్వారా రాష్ట్రం నుంచి సేకరించే బియ్యంలో 40 శాతం మాత్రమే తీసుకుంటామని, మిగతాది రా రైస్‌ పెట్టాలని నిబంధన విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటకు బాయిల్డ్‌ బియ్యం కోటాను పెంచాలని చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోక పోవడంతో కొనుగోళ్లు సజావుగా సాగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ జిల్లాలో 2,75,550 ఎకరాల్లో వరి సాగు

జిల్లాలో ఈసారి 2,75,550 ఎకరాలలో రైతులు వరి సాగు చేశారు. ఎకరాకు సగటున 24 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో విత్తన పంట విస్తీర్ణం 50వేల ఎకరాల పైచిలుకు ఉంటుంది. విత్తనపంట ఆయా కంపెనీలే కొనుగోలు చేస్తాయి. సుమారు 3,67,776 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతులు కొనుగోలుకేంద్రాలకు తీసుకవస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ ధాన్యం కొనుగోలు కోసం 318 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 182 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 91 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 37 కొనుగోలు కేంద్రాలు, హాకా ఆధ్వర్యంలో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఫ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

కోతలు ప్రారంభమై ధాన్యం ముమ్మరంగా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నది. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో 703 మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం వరి ధాన్యం 36 మెట్రిక్‌ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్‌ మిల్లులకు కస్టం మిల్లింగ్‌ కోసం పంపిస్తారు. ఈ ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు విముఖత చూపిస్తున్నారు. ఈ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకు 3,67,776 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతులు తీసుకు వస్తారని అంచనా వేశారు. అలాగే మరో లక్ష టన్నుల ధాన్యం మిల్లులకు రైతులు నేరుగా విక్రయిస్తారు. రెండు రకాలుగా మిల్లులకు సుమారు ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది.

ఫ మిల్లులో పేరకుపోయిన గత యాసంగి ధాన్యం

మిల్లుల్లో ఇప్పటికే గత యాసంగికి సంబంధించిన ధాన్యం నిల్వ ఉన్నది. సుమారు 1.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లుల్లో పేరుకు పోయింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ 40 శాతం మాత్రమే తీసుకుంటుండడంతో ఆమేరకే మిల్లింగ్‌ చేసి బియ్యం పంపించారు. యాసంగిలో పండించిన ధాన్యం మర ఆడించినప్పుడు ఎక్కువ శాతం నూకగా మారుతుంది. యాభై శాతం మాత్రమే బియ్యం రావడంతో మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారు. క్వింటాల్‌ వరి ధాన్యానికి మిల్లర్లు బాయిల్డ్‌ రైస్‌ అయితే 68 కేజీలు, రా రైస్‌ అయితే 67 కేజీలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. యాసంగిలో పండిన ధాన్యంతో 50 కిలోల రా రైస్‌ వస్తే 17 కిలోల మేరకు నష్టాన్ని భరించి ప్రభుత్వానికి బియ్యం పెట్టాల్సి ఉంటుంది. దీంతో బాయిల్డ్‌ రైస్‌ అయితేనే తాము ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం తీసుకుంటామని మిల్లర్లు అంటున్నారు. గత ధాన్యం నిల్వలే ఈ కారణంగా పేరుకుని పోగా మళ్లీ కొత్తగా తీసుకోవడానికి మిల్లుల్లో స్థలం కూడా లేదని బయట నిల్వ చేస్తే వర్షాలు వస్తే తడిసి నష్టపోవాల్సి వస్తుందని వారంటున్నారు. వేసవి కాలంలో పండించే ధాన్యం కేవలం ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో మాత్రమే రా రైస్‌ తీసేందుకు అనువుగా ఉంటుంది. మార్చి నెలలోనే ఆయా జిల్లాల్లో కోతలు పూర్తవుతాయి. దీంతో బియ్యం విరగిపోయే సమస్య ఉండదు. సివిల్‌ సప్లయిస్‌ శాఖ కోరిన విధంగా 67 కిలోల బియ్యం మిల్లర్లు తిరిగి ఇచ్చేందుకు పెద్దగా సమస్య ఉండదు. ఇతర జిల్లాల్లో మాత్రం బాయిల్డ్‌ బియ్యం పెట్టేందుకు మాత్రమే యాసంగి వరి ధాన్యం అనుకూలంగా ఉంటుంది. దీంతో మిల్లర్లు బాయిల్డ్‌ రైస్‌ పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని అప్పుడే ధాన్యం దించుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే వరి కోతలు ముమ్మరమై ధాన్యం అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు వస్తున్న నేపథ్యంలో సివిల్‌ సప్లయిస్‌ శాఖాధికారులు రెవెన్యూ అధికారులు మిలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ధాన్యం మిల్లింగ్‌ చేసేందుకు దింపుకోవాలని కోరుతున్నారు. మిల్లర్లు వారి సమస్యలను విన్నవిస్తూ అందుకు విముఖత చూపిస్తుండడంతో ప్రభుత్వం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రంతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతుందని ధాన్యం తీసుకోవాలని మిల్లర్లకు నచ్చచెబుతున్నారు. సోమవారం నుంచి మిల్లర్లు ధాన్యం దింపుకునేందుకు అంగీకరించారని ప్రచారం జరుగుతున్నా ఈసారి ఈ సమస్య కారణంగా కొనుగోళ్లు సజావుగా జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 26 , 2026 | 01:12 AM