Share News

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:43 AM

వేములవాడ భీమేశ్వర స్వామివారికి భక్తులు పోటెత్తారు.

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

వేములవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వేములవాడ భీమేశ్వర స్వామివారికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని పవిత్ర స్నానాలను ఆచరించారు. ఆయా క్యూలైన్‌లో ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మరికొంత మంది భక్తులు స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకునేందుకు భక్తులు కోడెల వద్ద క్యూకట్టారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి దీపారాధన చేయగా గండాదీపంలో నూనేపోస్తూ గండాలు తొలగిపోవాలని వేడున్నారు. గాయత్రి మాత ఆలయంలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ ఈవో రమాదేవి నేతృత్వంలో ఆలయ ఉద్యోగులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

చివరి వారం.. కిక్కిరిసిన అమ్మవారి ఆలయం..

వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివారం భక్తులు కిక్కిరిసిపోయారు. ఆషాఢ మాసం చివరి వారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాలతో క్యూలైన్‌లో బారులు తీరిన భక్తులు అమ్మవారికి పట్నాలు వేసి నైవేద్యాన్ని సమర్పించారు. పిల్లపాపలు, పాడి పంటలు చల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఇన్‌చార్జి చేపూరి లింగయ్య చర్యలు చేపట్టారు.

Updated Date - Aug 10 , 2026 | 12:43 AM