Share News

మానసాదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:26 AM

గన్నేరువరం మండలం ఖాసింపేటలో స్వయంభూగా వెలసిన మనసాదేవి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.

మానసాదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు

గన్నేరువరం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): గన్నేరువరం మండలం ఖాసింపేటలో స్వయంభూగా వెలసిన మనసాదేవి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. గాంధీ జయంతి సందర్భంగా సెలవు రోజు కావడంతో పాటు శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకమైన రోజుగా భావించడంతో కరీంనగర్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సుమారు 5 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కోనేటిలోని జంట నాగులకు, శివలింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఆలయ పరిసరాల్లో వాహనాల రాకపో కలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. అయితే భక్తుల సంఖ్య భారీగా పెరగ డంతో దర్శనం, అన్నదానం వంటి ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భోజనం కోసం భారీగా భక్తులు క్యూలైన్‌లో నిలబడాల్సి వచ్చింది. రద్దీని క్రమబద్ధీకరించడంలో సరైన ఏర్పాట్లు లేవు. క్యూలైన్‌ను నియంత్రించే క్రమంలో కొంతమంది సిబ్బంది దురుసుగా వ్యవహరించారని, మహిళా భక్తులను సైతం పట్టుకుని నెట్టివేశారని భక్తులు ఆరోపించారు. మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:26 AM