భీమన్న దర్శనంతో పులకించిన భక్తజనం
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:05 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.
వేములవాడ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. బతుకమ్మ, దసరా వరస సెలవుల నేపథ్యంలో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భీమన్న ఆలయ ప్రాంగణం శివనామంతో మార్మోగిపోయింది. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. పవిత్రస్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకోగా, భీమేశ్వర స్వామికి కోడెమొక్కు చెల్లించుకునేందుకు క్యూలైన్లలో రెండున్నర గంటలపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. ఆయా క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు భీమన్నను దర్శించుకుని అభిషేక పూజలో పాల్గొన్నారు. స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గండాదీపంలో నూనె పోస్తూ గండాలు తొలగిపోవాలని, దీపాలు వెలిగించి సుమంగళిగా వర్థిల్లాలని దీపారాధాన చేశారు. గాయత్రిమాత ఆలయంలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. సత్యనారాయణ వ్రతం, చండీహోమం, శివకల్యాణంలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులు పర్యవేక్షించారు.
కార్తీక మాసంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు..
- రాజన్న ఆలయ ఈవో రమాదేవి
వేములవాడ భీమేశ్వర స్వామి క్షేత్రంలో రాబోయే పవిత్ర కార్తీక మాసం ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాజన్న ఆలయ ఈవో రమాదేవి అధికారులకు సూచించారు. భీమన్న ఆలయంలో ఆదివారం ఉద్యోగులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రత్యేక పూజా వేదికలు తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వెంట డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.